–పాఠశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు
సలాం ప్రొద్దుటూరు–జమ్మలమడుగు:
విద్యార్థులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల సమీపంలోని ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని గతంలో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు చేసిన విజ్ఞప్తికి అధికారులు స్పందించారు. పెద్దపసుపుల మోటు బాలాజీ స్కూల్ కాంపౌండ్ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తాజాగా రక్షణ కంచె ఏర్పాటు చేయడంతో సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.గత కొన్ని నెలల క్రితం సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పట్టణ విద్యుత్ అధికారులు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు పట్టణ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఏ. వినయ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబు తెలిపారు. పాఠశాల సమీపంలోనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో పాటు దానికి సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, విద్యుత్ వైర్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని అప్పట్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉండటం ఆందోళన కలిగించే అంశమని నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ రక్షణ కంచెలు లేని ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వాటిలో కొన్ని ప్రాంతాల్లో కంచెలు ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు.ప్రజా సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. కొంత ఆలస్యమైనప్పటికీ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతాయని, ముఖ్యంగా విద్యార్థులు, కార్మికుల భద్రత విషయంలో రాజీ లేకుండా ఉద్యమించి సమస్యలను పరిష్కరించుకుంటామని వినయ్‌కుమార్, హరిబాబు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం. ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
