–25 ఏళ్లుగా మత, సామాజిక సేవల్లో విశిష్ట సేవలు
సలాం ప్రొద్దుటూరు –చాపాడు:
చాపాడు మండలం చాపాడు గ్రామానికి చెందిన ప్రముఖ ముస్లిం మత గురువు ముల్లా హబీబుల్లా అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలియగానే చాపాడు మండల వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు, సోదరీమణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ముల్లా హబీబుల్లా గత 25 సంవత్సరాలుగా చాపాడు మండల ముస్లిం సమాజానికి మత గురువుగా సేవలందించారు. మతపరమైన కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమాజ సేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన సేవలను ముస్లిం సమాజానికి చెందిన పలువురు గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు.
మతపరమైన విషయాల్లో ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూ, సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు. ఆయన మృతి చాపాడు మండల ముస్లిం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.
ముల్లా హబీబుల్లా అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అంత్యక్రియలకు మండలంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులు, వివిధ వర్గాల ప్రజలు హాజరుకానున్నారు.
