–జీవనజ్యోతి విద్యాసంస్థల్లో వినూత్న అవగాహన కార్యక్రమం
– జంక్‌ఫుడ్, అధిక సెల్‌ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరించిన నిర్వాహకులు
– అల్ట్రాసౌండ్, వైద్య పరీక్షల సన్నివేశాలతో చిన్నారుల్లో ఆరోగ్య చైతన్యం
–చిప్స్, జంక్‌ఫుడ్ అందించినా తీసుకోవడానికి నిరాకరించిన విద్యార్థులు
–విద్యార్థుల్లో మంచి అలవాట్లు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని తల్లిదండ్రుల అభిప్రాయం
– జీవనజ్యోతి విద్యాసంస్థల్లో వినూత్న అవగాహన కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు:
జంక్‌ఫుడ్, అధిక సెల్‌ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రొద్దుటూరు పట్టణంలోని జీవనజ్యోతి విద్యాసంస్థల్లో బుధవారం చిన్నారులకు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధినేత అమర్నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ సందర్భంగా జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఓ విద్యార్థిని ఎంపిక చేసి జంక్‌ఫుడ్ తినిపించిన అనంతరం కడుపునొప్పి వచ్చినట్లు సన్నివేశాన్ని రూపొందించారు. అనంతరం అల్ట్రాసౌండ్ స్కానింగ్, వైద్యుల పర్యవేక్షణ తదితర సన్నివేశాలను ప్రదర్శిస్తూ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.అదేవిధంగా గంటల తరబడి సెల్‌ఫోన్ చూడటం వల్ల కళ్లపై పడే ప్రభావాలను కూడా వినూత్నంగా ప్రదర్శించారు. ఓ విద్యార్థి రెండు కళ్లకు కట్లు కట్టి చూపు కోల్పోయినట్లు నటించడంతో మిగిలిన చిన్నారులు ఆలోచనలో పడ్డారు. సెల్‌ఫోన్‌ను అవసరానికి మించి ఉపయోగించకుండా సమయాన్ని పరిమితం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమం ముగింపులో ఉపాధ్యాయులు విద్యార్థులకు చిప్స్ ప్యాకెట్లు, ఇతర జంక్‌ఫుడ్, సెల్‌ఫోన్లు అందించేందుకు ప్రయత్నించగా, అప్పటికే కార్యక్రమం ద్వారా అవగాహన పొందిన చిన్నారులు వాటిని తీసుకునేందుకు నిరాకరించడం విశేషం. దీంతో విద్యార్థుల్లో కార్యక్రమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో స్పష్టమైంది.వినూత్న రీతిలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులను ఆకట్టుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, పరిమిత సెల్‌ఫోన్ వినియోగం పట్ల వారిలో చైతన్యాన్ని నింపింది. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న పాఠశాల అధినేత అమర్నాథ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బందికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు పాఠశాల స్థాయిలోనే మంచి అలవాట్లకు పునాదులు వేస్తూ మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
