
–జమ్మలమడుగులో పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ
సలాం ప్రొద్దుటూరు – జమ్మలమడుగు:
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పశువుల ఆరోగ్యం, పశుగ్రాసం, నీటి నిర్వహణ మరియు వేడి ఒత్తిడి నివారణపై రైతులు, పారా వెట్స్కు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో బుధవారం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, జమ్మలమడుగులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ గారు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. వీరబ్రహ్మయ్య గారు, అసిస్టెంట్ డైరెక్టర్ డా. శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ గారు మాట్లాడుతూ, వాతావరణ మార్పులు మరియు ఎల్నినో వంటి పరిస్థితులు పశుసంవర్ధక రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవి తీవ్రత పెరిగినప్పుడు పశువుల్లో వేడి ఒత్తిడి (Heat Stress) ఏర్పడి మేత తీసుకోవడం, పాల ఉత్పత్తి మరియు పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.పశువులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచడం, తగినంత నీడ కల్పించడం, షెడ్లలో గాలి ప్రసరణ ఉండేలా చూడడం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే పచ్చిమేత కొరతను అధిగమించేందుకు రైతులు ముందుగానే ఎండుగడ్డి, సైలేజ్ మరియు ఇతర పశుగ్రాసాలను నిల్వ చేసుకోవాలని సూచించారు.ఎల్నినో పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో పెరిగే పశుగ్రాస పంటలను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. పశువులకు సమతుల్య పోషణ అందించడంతో పాటు ఖనిజ మిశ్రమాన్ని అవసరానికి అనుగుణంగా అందించాలని సూచించారు.రైతులకు శాస్త్రీయ పశుపోషణ పద్ధతులపై అవగాహన కల్పించడంలో పారా వెట్స్ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ప్రిన్సిపాల్ గారు పేర్కొన్నారు. పశువుల్లో వేడి ఒత్తిడి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఎల్పీఎం విభాగానికి చెందిన డా. ఇందిర గారు ఎల్నినో పరిస్థితుల్లో పశువుల యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస నిర్వహణ మరియు వేడి ఒత్తిడి నివారణపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో డా. జ్యోతి, డా. సాయి కృష్ణ, డా. చరిత, డా. జాన్, డా. గాయత్రి, డా. మంజుల తదితర కళాశాల అధ్యాపకులు పశు పునరుత్పథీ,పశువుల వ్యాధుల చికిత్స,పరాన్నజీవుల నివారణ పశుయజమాన్యం పశుపోషణ గురించి వివరించారు .పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యులు, పారా వెట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నీరు, పశుగ్రాసం మరియు పశువుల ఆరోగ్య నిర్వహణపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కార్యక్రమంలో సూచించారు.అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. డి.ఇందిర,పశువైద్య కళాశాల హజరయ్యారు.

