–రైల్వే, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. రూ.8 లక్షల నగదు స్వాధీనం
సలాం ప్రొద్దుటూరు – పులివెందుల:
రైల్వే, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదును చట్టపరమైన ప్రక్రియలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, IPS ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి. మురళి పర్యవేక్షణలో, పులివెందుల U/G పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీరామ్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఎస్‌ఐలు ఎం. మధుసూదన్ రెడ్డి, ఎల్. తిమోతి, సిబ్బంది కలిసి నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 18న సాయంత్రం కనంపల్లి చెక్‌పోస్ట్, కదిరి చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు నిందితులను గుర్తించి, చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని పులివెందుల న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
ఇన్ఫోసిస్ ఉద్యోగం పేరుతో మోసం
Cr.No.23/2025 U/s 420 IPC కేసులో నామల జన ప్రకాష్ రావు అనే వ్యక్తి పులివెందుల పట్టణంలోని రుషి కాలనీకి చెందిన వెన్నపూస మల్లికార్జున రెడ్డికి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.డబ్బులు తీసుకున్న అనంతరం అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తానని పలుమార్లు వాయిదా వేస్తూ, చివరకు ఫిర్యాదుదారుడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, తన నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి 2025 జనవరి 22న పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైల్వే ఉద్యోగాల పేరుతో మరో మోసం
Cr.No.203/2025 U/s 420 IPC కేసులో క్రిష్ణయ్య మహేష్ అలియాస్ వీరస్వామి క్రిష్ణ అనే వ్యక్తి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పులివెందుల పట్టణానికి చెందిన ఎస్లావత్ జనార్ధన్ నాయక్, ఆయన అన్న, కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి హామీలను నమ్మిన ఫిర్యాదుదారు, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.2 లక్షలను నిందితుడికి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో 2025 మార్చి 24న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రూ.8 లక్షల నగదు స్వాధీనం
రెండు కేసుల దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.8 లక్షల నగదును చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసులలో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఉద్యోగాల పేరుతో మోసాలకు దూరంగా ఉండాలి
ఉద్యోగం ఇప్పిస్తామని, డబ్బులు చెల్లిస్తే ఉద్యోగం ఖాయమని చెప్పే వ్యక్తుల మాటలను ప్రజలు నమ్మవద్దని పులివెందుల పోలీసులు సూచించారు. పరిచయాలు, అధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పినా సరైన ఆధారాలు లేకుండా ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదన్నారు.ఉద్యోగ నియామకాలు అధికారిక ప్రక్రియ ద్వారానే జరుగుతాయని, ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.“ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వొద్దు.. మోసగాళ్ల చేతిలో మీ భవిష్యత్తును పెట్టొద్దు” అని పులివెందుల U/G పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీరామ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
