సలాం ప్రొద్దుటూరు –కడప
రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కలిశారు. కడప పట్టణంలోని జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి స్వగృహంలో కడప జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రజలకు మెరుగైన పాలన, అభివృద్ధి ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
