


–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో బాధ్యతల స్వీకరణ
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.
ఇప్పటివరకు ఛైర్మన్‌గా ఉన్న వద్ది సురేఖ బాలుడు అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో, వైస్ ఛైర్మన్‌గా ఉన్న పట్నం లక్ష్మణ్‌కు ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డు అభివృద్ధి కి కృషి
రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డు అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని పట్నం లక్ష్మణ్ పేర్కొన్నారు. మార్కెట్ యార్డు ద్వారా రైతులకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బీసీలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత–ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి
కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఇన్‌చార్జ్ ఛైర్మన్‌గా పట్నం లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.గతంలో కూడా వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవిని బీసీ వర్గానికి చెందిన వద్ది సురేఖకు అందించామని, అయితే ఆమె అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆమె స్థానంలో అదే విధంగా బీసీ వర్గానికి చెందిన పట్నం లక్ష్మణ్‌కు ఇన్‌చార్జ్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించామని చెప్పారు.సామాజిక న్యాయం, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలకు రాజకీయ, సామాజిక, పరిపాలనా రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తూ అవకాశాలు అందిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమానికి మార్కెట్ యార్డు కీలకంగా పనిచేస్తుందని, పట్నం లక్ష్మణ్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వీఎస్ ముక్తియార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ నాయకులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పట్నం లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.



