


–శతాబ్దాల ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా వేడుకలు
–ఫకీర్ల మేళతాళాల నడుమ గంధం ఊరేగింపు.. ప్రత్యేక ప్రార్థనలు..
–కులమతాలకు అతీతంగా తరలివచ్చిన వేలాది భక్తులు..
సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):
ఆధ్యాత్మికత, సూఫీ సంప్రదాయం, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్న హజరత్ సయ్యద్ షా నబిషా ఖాద్రి స్వామి గందోత్సవం జమ్మలమడుగులో భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్లామిక్ మాసం సఫర్ 28వ తేదీని పురస్కరించుకుని పెన్నా నది ఒడ్డున పొన్నతోటలోని స్వామివారి దర్గా వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు హాజరయ్యారు.
జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదు నుంచి ఫకీర్ల మేళతాళాలు, ఆధ్యాత్మిక నినాదాల నడుమ గంధాన్ని ప్రత్యేక ఊరేగింపుగా తీసుకువెళ్లారు. సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న ఈ గంధం ఊరేగింపు పెన్నా నది ఒడ్డున ఉన్న నబిషా ఖాద్రి స్వామి దర్గా వరకు సాగింది. అనంతరం పీఠాధిపతులు స్వామివారికి గంధం సమర్పించారు. భక్తులు పూల చాదర్లు, గల్ఫ్‌లు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
సఫర్ 28న ఇమామ్ హసన్ (ర.అ.) షహాదత్ స్మరణ.. అదే రోజున నబిషా ఖాద్రి గందోత్సవం
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని సఫర్ 28వ తేదీకి ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పీఠాధిపతి సయ్యద్ షా నయీమ్ పాషా ఖాద్రి తెలిపారు. ఈ రోజున హజరత్ ఇమామ్ హసన్ (ర.అ.) షహాదత్‌ను ముస్లిం సమాజం భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటుంది. సుమారు 45 ఏళ్ల వయసులో ఇమామ్ హసన్ (ర.అ.) వీరమరణం పొందినట్లు ఇస్లామిక్ సంప్రదాయాల్లో పేర్కొంటారు.ఇదే సఫర్ 28వ తేదీన ఆయన వంశానికి చెందిన జమ్మలమడుగులో పెన్నా నది ఒడ్డున ఉన్న హజరత్ సయ్యద్ షా నబిషా ఖాద్రి స్వామి గందోత్సవం నిర్వహించడం విశేషంగా భావిస్తున్నారు.ఇమామ్ హసన్ (ర.అ.) షహాదత్‌ను స్మరించుకునే పవిత్ర రోజునే నబిషా ఖాద్రి స్వామి గందోత్సవం జరగడం తమ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రత్యేకమైన విశేషమని పీఠాధిపతి సయ్యద్ షా నయీమ్ పాషా ఖాద్రి పేర్కొన్నారు.
దస్తగిరి స్వామి ఏడవ తరం వారసుడే నబిషా ఖాద్రి..
సూఫీ ఆధ్యాత్మిక పరంపరలో విశిష్ట స్థానాన్ని కలిగిన హజరత్ షేక్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ (దస్తగిరి స్వామి) వంశపారంపర్య ఆధ్యాత్మిక వారసత్వంలో సయ్యద్ నబిషా ఖాద్రి స్వామి ఏడవ తరం వారసుడు. ఆయన ఇరాక్ దేశంలోనీ బాగ్దాద్ నగరం నుండి సర్వ మానవాళి సంక్షేమం కోసం భారతదేశం కు వచ్చారు. కాలినడకన ఆయన దేశంలోని ప్రముఖ రాష్ట్రాలు ప్రయాణం చేసి జమ్మలమడుగు లోని పెన్నా నది తీరం లో ప్రస్తుతం పొన్న తోట లో స్థిరపడ్డారు. ఆయన జమ్మలమడుగు పట్టణానికి వచ్చినప్పుడు కేవలం రెండు ఇల్లు పూర్తయి మరొక ఇల్లు సగం మాత్రమే పూర్తయింది. అలాంటి సమయంలోనే ఆయన దివ్య పాదాలతో చుట్టుప్రక్కల ప్రాంతాలు తిరుగుతూ ఎన్నో మహిమలు చూపించారని పీఠాధిపతులు తెలిపారు. 300 సంవత్సరాలు అయినప్పటికీ నబీ షా ఖాద్రి స్వామి ఇప్పటికీ వచ్చిన భక్తులకు తన మహిమల ద్వారా భక్తుల కొంగుబంగారం అని కొనియాడారు.తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక పరంపరలో మానవత, సేవ, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక విలువలకు పెద్దపీట వేస్తూ నబిషా ఖాద్రి స్వామి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారని పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ పాషా ఖాద్రి తెలిపారు.దస్తగిరి స్వామి ఆధ్యాత్మిక పరంపరతో అనుబంధం కలిగిన ఈ దర్గాకు 300 సంవత్సరాలకు పైగా చారిత్రక, ఆధ్యాత్మిక సంప్రదాయం ఉందని పీఠాధిపతులు తెలిపారు.స్వామి వారు ఆధ్యాత్మిక సాధనలో భాగంగా 18 సార్లు బాగ్దాద్‌తో పాటు పవిత్ర హజ్ యాత్రను కాలినడకన చేశారని వారు వివరించారు. ఆయన జీవితం త్యాగం, ఆధ్యాత్మిక సాధన, మానవ సేవకు ప్రతీకగా నిలిచిందని భక్తులు విశ్వసిస్తారు.
పెన్నా తీరంలో ఆధ్యాత్మిక కేంద్రం
జమ్మలమడుగు పట్టణానికి సమీపంలోని పెన్నా నది తీరంలో పొన్నతోటలో ఉన్న నబిషా ఖాద్రి స్వామి దర్గా తరతరాలుగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రంగా కొనసాగుతోంది. స్థానికంగా ఈ ప్రాంతాన్ని, స్వామివారి ఆధ్యాత్మిక పరంపరను ప్రత్యేకమైన పేర్లతో భక్తులు స్మరించుకుంటూ ఉంటారని నిర్వాహకులు తెలిపారు.కాలం మారుతున్నా ఆధ్యాత్మిక సంప్రదాయాలను, పూర్వీకులు పాటించిన ఆచారాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది గందోత్సవాన్ని నిర్వహించడం విశేషమని వారు పేర్కొన్నారు.
ఫాతిహా.. సర్వమానవ శాంతికి ప్రార్థనలు
గంధం సమర్పించిన అనంతరం ఫాతిహా నిర్వహించారు. సర్వమానవులు సుఖశాంతులతో ఉండాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి దర్గాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆస్థానే కమలియా జామియా మసీదు, జమ్మలమడుగు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హాజరైన భక్తులకు ఆశీస్సులు అందిస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
సూఫీ సంప్రదాయంలో మానవతకు పెద్దపీట
సయ్యద్ షా నబీషా ఖాద్రి స్వామి గొప్ప ఆధ్యాత్మికవేత్త, సూఫీ గురువు, మానవతావాది అని పీఠాధిపతులు కొనియాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆధ్యాత్మిక ధైర్యాన్ని అందించడం, మానవ సేవ, ప్రేమ, సోదరభావం వంటి విలువలను చాటిచెప్పడం సూఫీ సంప్రదాయంలోని ప్రధాన సందేశాలని పేర్కొన్నారు.కష్టాలు ఎదురైనప్పుడు స్వామివారిని స్మరించి ప్రార్థనలు చేసుకుంటే అల్లాహ్, మహమ్మద్ ప్రవక్త (స) ఆశీస్సులతో మనోధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసమని తెలిపారు.
వేలాదిగా భక్తుల రాక.. అన్నదానం
గందోత్సవానికి జమ్మలమడుగుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ గందోత్సవంలో హజరత్ సయ్యద్ షా నయీమ్ పాషా ఖాద్రి, సయ్యద్ షా అహ్మద్ పాషా ఖాద్రి, సయ్యద్ షా కాశిఫ్ పాషా ఖాద్రి, సయ్యద్ షా అతీఫ్ పాషా ఖాద్రి పీఠాధిపతుల ఆధ్వర్యంలో గంథం జరిగింది.ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ, తరతరాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న సయ్యద్ షా నబిషా ఖాద్రి గందోత్సవం జమ్మలమడుగు ప్రాంత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలిచింది.


