ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్నకిలీ కారుణ్య నియామకాల మోసం ఛేదించిన కడప పోలీసులు

నకిలీ కారుణ్య నియామకాల మోసం ఛేదించిన కడప పోలీసులు

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు  ( కడప):

కారుణ్య నియామకాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నకిలీ ఉద్యోగ నియామకాల వ్యవహారాన్ని కడప పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. సుమారు 25 మంది అభ్యర్థుల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు.

అధికారుల సంతకాలతో నకిలీ నియామక ఉత్తర్వులు

అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ నియామక ఉత్తర్వులను తయారు చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ నకిలీ ఉత్తర్వుల ఆధారంగా సుమారు 25 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినట్లు గుర్తించామని చెప్పారు. వారిలో పలువురు ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్‌మెన్‌లుగా విధుల్లో చేరినట్లు వెల్లడించారు.

నకిలీ నియామకాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.3.80 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్

ఈ కేసులో సయ్యద్ మస్తాన్ వల్లి, చిలుమారు శ్రీనివాసుల రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన ఇద్దరూ గతంలో జెడ్పీ కార్యాలయంలో విధులు నిర్వహించినవారేనని, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారని వెల్లడించారు.

2018 నుంచి కారుణ్య నియామకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైందని ఎస్పీ తెలిపారు. నకిలీ ఉత్తర్వుల తయారీ, అభ్యర్థుల నుంచి డబ్బుల వసూళ్లు, నియామకాల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ఇతరుల పాత్రపైనా దర్యాప్తు

ఈ వ్యవహారంలో మరెవరైనా అధికారులు, సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నకిలీ నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరిన 25 మంది అభ్యర్థుల పాత్రపైనా విచారణ జరుగుతోందన్నారు.

కేసు దర్యాప్తు పూర్తయిన అనంతరం నకిలీ నియామకాల వెనుక ఉన్న మరిన్ని వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నిరుద్యోగులు ఉద్యోగాల పేరుతో ఎవరినీ నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించవద్దని, అనుమానాస్పద వ్యవహారాలు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!