సలాం ప్రొద్దుటూరు (అమరావతి):
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను 2026 సెప్టెంబర్ 3న ప్రచురించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 401/SEC-F1/2026-1 ద్వారా ప్రకటించింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈ ఓటర్ల జాబితాలను ప్రామాణికంగా ఉపయోగించనున్నారు. అలాగే మేయర్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియలోనూ ఈ జాబితాలు కీలకంగా ఉండనున్నాయి.
2026 జనవరి 1ను అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల జాబితాలను రూపొందించి ప్రచురించే బాధ్యతను ఆయా మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో మాత్రం సంబంధిత జోనల్ కమిషనర్లు తమ తమ జోన్‌లకు సంబంధించిన వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి ప్రచురించనున్నారు.
ఓటర్ల జాబితాల ప్రచురణతో మున్సిపల్ ఎన్నికల తదుపరి ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.
