సలాం ప్రొద్దుటూరు :
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొద్దుటూరులో మంగళవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ గాంధీ రోడ్డు, విజయకుమార్ సర్కిల్, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్ వరకు కొనసాగింది. కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో పట్టణ టిడిపి అధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరమని అన్నారు.
నియోజకవర్గ పరిశీలకులు కొండవీటి భావన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లోనూ ప్రజలు అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమ య్యాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతితో పాటు పలు కీలక కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ యువత రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి, విద్యా అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రజల ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పార్టీ జెండాలు, నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధులు సందడిగా మారాయి.
