–విద్యతోనే సామాజిక స్థాయి, ఆర్థిక ప్రగతి సాధ్యం
–కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ వినూత్నంగా చేపట్టిన ‘కాఫీ విత్ కమీషనర్’ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది.గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీటెక్, డిగ్రీ, ఫార్మసీ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు 35 మంది పారిశుధ్య కార్మికుల పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆశయాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.విద్యార్థులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన పేదరికం ఉన్నత విద్యకు అడ్డంకి కాదని, కృషి, పట్టుదల, లక్ష్యసాధనతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులు ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తుచేశారు. వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ లక్ష్యాల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.“సామాజిక వివక్ష నుంచి బయటపడాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో గౌరవం మరియు సామాజిక స్థాయి పెంచుకోవాలన్నా విద్యే ప్రధాన మార్గం” అని కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ విద్యార్థులకు హితబోధ చేశారు. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను విద్యార్థులకు వివరించారు.అనంతరం విద్యార్థులతో కలిసి కమిషనర్ కాఫీ, స్నాక్స్ స్వీకరించి వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. దీంతో విద్యార్థుల్లో ఉన్న భయం, సంకోచం తొలగి కమిషనర్‌తో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది.పారిశుధ్య కార్మికుల పిల్లల విద్య, కెరీర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కమిషనర్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాల నాయకులు సాల్మన్, చంటి తదితరులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అభినందించారు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.

