ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాఫీ పౌడర్ మాటున.. ఎర్రచందనం స్మగ్లింగ్.. ₹1.30 కోట్ల సొత్తు స్వాధీనం

కాఫీ పౌడర్ మాటున.. ఎర్రచందనం స్మగ్లింగ్.. ₹1.30 కోట్ల సొత్తు స్వాధీనం

📰 Generate e-Paper Clip

 

–ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌.. 

–పోలీసులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నం.. ఎనిమిది మంది అరెస్ట్‌

 

–1,984 కిలోల ఎర్రచందనం, మూడు వాహనాలు స్వాధీనం

 

సలాం ప్రొద్దుటూరు –   పోరుమామిళ్ల:

ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝళిపించారు. వైఎస్సార్ కడప జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి, రూ.1,30,34,400 విలువైన ఎర్రచందనం దుంగలు, వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల సమయంలో నిందితులు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

 

వాహనాల తనిఖీల్లో పట్టుబడిన ముఠా

 

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కడప రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్‌కు అందిన సమాచారంతో పోరుమామిళ్ల సీఐ ఆర్.జి. సుబ్రహ్మణ్యం, పోలీసు సిబ్బందితో కలిసి ఎస్‌.ఎ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలోని రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు.బుధవారం ఉదయం 6 గంటల సమయంలో జ్యోతి వైపు నుంచి వస్తున్న మూడు వాహనాలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వాటిలో ఉన్న నిందితులు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారైనట్లు వెల్లడించారు.

 

కంటైనర్‌లో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా

 

నిందితుల నుంచి 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 1,984 కిలోలు కాగా, మార్కెట్ విలువ రూ.81,34,400గా అంచనా వేశారు. ఎర్రచందనం దుంగలను కంటైనర్‌లో దాచిపెట్టి తరలించేందుకు 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.28 లక్షల విలువైన ఈచర్ కంటైనర్, రూ.16 లక్షల విలువైన టూఫాన్ వాహనం, రూ.5 లక్షల విలువైన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఉన్నాయి. వీటితో పాటు ఐదు గొడ్డళ్లు, ఆరు రాళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.1.30 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు.

 

మూడు రాష్ట్రాలకు చెందిన నిందితులు

 

ఈ కేసులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పెరుమాళ్ (42), శక్తివేల్ పొట్టి (37), వెల్లయ్యన్ శ్రీనివాసన్ (43), అన్బళగన్ (46), సురేష్ (22), దురైసామి అన్నామలై (46), కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రఘు సెల్వకుమార్ (38), ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కుంబం మండలానికి చెందిన చాబోలు వెంకట కుమార్ (22)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

 

కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఎర్రచందనం దుంగలు, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్న పోరుమామిళ్ల సీఐ ఆర్.జి. సుబ్రహ్మణ్యం, రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్, పోరుమామిళ్ల ఎస్‌ఐ ఎ. విద్యాసాగర్, ఎస్‌.ఎ. కాశినాయన ఎస్‌ఐ డాక్టర్ నాయక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

 

అక్రమ రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక

 

ఎర్రచందనాన్ని నరికివేసినా, నిల్వ చేసినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా లేదా అక్రమ కార్యకలాపాలకు సహకరించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. అవసరమైతే పునరావృత నేరస్తులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!