

–ప్రారంభోత్సవంలో డా. వి.ఎస్. ముక్తియార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి దసరా నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని ప్రొద్దుటూరులో మున్సిపల్ అనిబిసెంట్ మైదానం లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి దసరా నవరాత్రుల వేడుకలు ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ప్రొద్దుటూరుకు తరలివస్తారని పేర్కొన్నారు. ప్రతిరోజూ వాసవీమాతకు నిర్వహించే విశేష అలంకరణలను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారని అన్నారు.
నవరాత్రుల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎగ్జిబిషన్
దసరా నవరాత్రుల సమయంలో ఎగ్జిబిషన్‌ను సందర్శించడం ప్రొద్దుటూరు ప్రజలకు సంప్రదాయంగా మారిందని డా వి ఎస్ ముక్తియర్ పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుతో పాటు, పిల్లలు, పెద్దలు వినోద కార్యక్రమాలు, ఆటవస్తువులు, ఆధునిక వినోద పరికరాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు స్థానిక వ్యాపార కార్యకలాపాలకు ప్రోత్సాహాన్ని ఇస్తాయని అభిప్రాయపడ్డారు.
నిర్వాహకులకు శుభాకాంక్షలు
ఎగ్జిబిషన్ ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగాలని, నిర్వాహకులకు మంచి లాభాలు చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు బెపారి జాకీర్ అహ్మద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, టిడిపి సీనియర్ నాయకులు ఈ వి సుధాకర్ రెడ్డి ,కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.



