ePaper
Monday, October 19, 2026
ePaper
Homeరాజకీయం నామినేషన్ పత్రాల చించివేత ప్రజాస్వామ్యంపై దాడి

 నామినేషన్ పత్రాల చించివేత ప్రజాస్వామ్యంపై దాడి

📰 Generate e-Paper Clip

 

– ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దౌర్జన్యాలపై సీపీఎం ఆగ్రహం

– ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గం

–సీపీఎం నేత మనోహర్ ,సత్యం

 

సలాం ప్రొద్దుటూరు:

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడి నామినేషన్ పత్రాలను చించివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మనోహర్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధంగా, స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మనోహర్, ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు వినయ్ సంయుక్త ప్రకటనలో ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

మూడో వార్డు అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేత

 

సీపీఎం తరఫున ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని మూడో వార్డు అభ్యర్థి ఫకీరయ్య నామినేషన్ పత్రాలను చించివేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని నాయకులు ఆరోపించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రంలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడుతున్నా, వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమని పేర్కొన్నారు.

 

రిటర్నింగ్ అధికారుల తీరుపై విమర్శలు

 

నామినేషన్ కేంద్రాల్లో అనధికార వ్యక్తులు సంచరిస్తూ, అక్కడే తిష్టవేసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని నాయకులు అన్నారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. అనంతరం డీఆర్వో ఫోన్‌ ద్వారా స్పందించడాన్ని అభినందించారు.

 

ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలి

 

ప్రొద్దుటూరుతో పాటు జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో దౌర్జన్యాలు కొనసాగితే అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయడం, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నామినేషన్ కేంద్రాల్లో అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని అరికట్టి, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో బి. విజయ్ కుమార్, జి. ఫకీరయ్య, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి విశ్వనాథ్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!