–గణేష్ ఉత్సవాల వేళ 48 గంటలుగా నిరంతర సేవలు..
–ప్రజలు, వ్యాపారులు సహకరించాలి
–కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్
సలాం ప్రొద్దుటూరు:
పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకుంటుంటే.. పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు మాత్రం తమ పండుగను పక్కనపెట్టి నిరంతరం సేవలందిస్తున్నారని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా గత 48 గంటలుగా పారిశుధ్య కార్మికులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు.ప్రొద్దుటూరు ప్రధాన వ్యాపార కేంద్రం కావడంతో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు, వ్యాపారులు పట్టణానికి తరలివచ్చారని కమిషనర్ తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా చెత్త పేరుకుపోయిందన్నారు. కేవలం గణేష్ ఉత్సవాల మొదటి రోజే సుమారు 15 టన్నుల చెత్త పట్టణంలో పేరుకుపోయిందని వివరించారు.
వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా..
వ్యాపారాలు నిర్వహించడంలో తప్పు లేదని, అయితే వ్యాపార కార్యకలాపాలతో పాటు పరిసరాల పరిశుభ్రతను కాపాడే బాధ్యతను కూడా ప్రతి వ్యాపారి తీసుకోవాలని కమిషనర్ సూచించారు. చెత్తను రోడ్లపై పడేయకుండా స్వీయ పారిశుధ్య నిర్వహణలో భాగస్వాములు కావాలని కోరారు.పురపాలక సంఘంలో పరిమిత సంఖ్యలో పారిశుధ్య కార్మికులు మాత్రమే ఉన్నారని, వారికి కమిషనర్ ఉన్నారనే భావనతో మొత్తం బాధ్యతను మున్సిపల్ సిబ్బందిపైనే వేయడం సరికాదన్నారు. ప్రజలు, వ్యాపారులు కూడా తమ వంతు బాధ్యతగా పట్టణ పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెల్లవారుజామున 3 గంటల నుంచే..
“ఉదయం 3 గంటల నుంచే నేను, నా సిబ్బంది వీధుల్లో తిరుగుతున్నాం. పగటిపూట భక్తులతో సందడిగా కనిపించిన రోడ్లు మరుసటి రోజు ఉదయం చెత్తతో నిండిపోయి ప్రజలకు, గణేష్ భక్తులకు స్వాగతం పలకడం మాకు ఇష్టం లేదు. అందుకే పారిశుధ్య కార్మికులు యుద్ధంలో సైనికుల్లా రంగంలోకి దిగుతున్నారు” అని కమిషనర్ పేర్కొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలను ప్రజలు గుర్తించి గౌరవించాలని ఆయన కోరారు. గణేష్ ఉత్సవాల వేళ ఇతరులు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పారిశుధ్య సిబ్బంది తమ కుటుంబాలకు, పండుగకు దూరంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇది ప్రచారం కాదు.. వాస్తవం
పారిశుధ్య కార్మికుల సేవలను ప్రజలకు తెలియజేయడం ప్రచారం కోసం కాదని, ఇది పట్టణంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి అని కమిషనర్ స్పష్టం చేశారు. దీనిని ప్రచారంగా భావించినా, రీల్స్‌గా భావించినా ప్రజల ఇష్టం.. కానీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవ మాత్రం నిజమని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు సహకరించండి
పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారులు మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.
“పారిశుధ్యం కేవలం మున్సిపాలిటీ బాధ్యత కాదు.. ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. మీ సహకారంతోనే ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన ప్రొద్దుటూరు సాధ్యం” అని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పిలుపునిచ్చారు.


