–ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వ పథకం ద్వారా అవకాశం
–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
అర్హులైన ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో జగనన్న ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.
సొంత ఇంటి స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇల్లు నిర్మించుకోలేని వారు ప్రభుత్వ గృహ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని వరదరాజులరెడ్డి తెలిపారు. ముఖ్యంగా వన్‌టౌన్ ప్రాంతంలో ఇరుకైన ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు కూడా గృహ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్లా, టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు నాగరాజు, కుతుబుద్దీన్, చౌడం వెంకట కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
