– విద్యార్థి రూపొందించిన యాప్‌ను ఆవిష్కరించిన ఏఎస్పీ విభూ కృష్ణ
సలాం ప్రొద్దుటూరు:
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో ఉద్యోగాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (ఎస్‌వీడీసీ) విద్యార్థులను ఏఎస్పీ విభూ కృష్ణ సోమవారం అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగాలు సాధించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా వారి విజయానికి దోహదపడిందని అన్నారు.విద్యార్థులు ఇదే పట్టుదలతో తమ వృత్తి జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరింత మంది యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్ విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.విద్యార్థుల విజయానికి క్రమశిక్షణ, కష్టపడి చదవడం, నైపుణ్యాల అభివృద్ధి అత్యంత కీలకమని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. ప్రతి విద్యార్థి ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కళాశాల కరస్పాండెంట్ అరకట వేముల హరినారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతున్నప్పుడే ఉద్యోగ అవకాశాలు పొందాలనే లక్ష్యంతో దేశ్‌పాండే స్కిల్స్ ఎడ్యుకేషన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని తెలిపారు. ఆ సంస్థ అందిస్తున్న శిక్షణ ద్వారా ఈ విద్యా సంవత్సరంలోనే సుమారు 134 మంది విద్యార్థులు వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని వెల్లడించారు.కళాశాల డైరెక్టర్ అరకట వేముల పృథ్వీనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగ సాధనలో సాంకేతిక నైపుణ్యాలతో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆ దిశగా కళాశాలలో ప్రత్యేక శిక్షణ అందించడం వల్ల విద్యార్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు.కళాశాల కోఆర్డినేటర్ పర్లపాడు గౌరీ మాట్లాడుతూ కళశాల నినాదమైన యాడింగ్ పవర్ టు ఎడ్యుకేషన్ తో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందిస్తూ విజయపథంలో నడిపిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శారద భవాని, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, అధ్యాపకులు, ఎన్సీసీ కేడెట్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
