సలాం ప్రొద్దుటూరు:
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన బీహారీ యువకుడు మున్నా కుమార్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. హత్య అనంతరం మూడు నెలలుగా పరారీలో ఉన్న బీహార్‌కు చెందిన ఇద్దరు నిందితులు దీపు కుమార్, బిర్జు కుమార్‌లను ఇన్‌స్టాగ్రామ్ క్లూతో పాటు సాంకేతిక ఆధారాల సాయంతో అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) విభూ కృష్ణ, ఐపీఎస్ వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం.. మోడమీదిపల్లె గ్రామంలోని ఓ డెయిరీ ఫారంలో పనిచేస్తున్న మున్నా కుమార్ ఈ ఏడాది ఏప్రిల్ 7న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదికతో పాటు శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి, గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు.హత్య అనంతరం అదే ఫారంలో పనిచేస్తున్న దీపు కుమార్, బిర్జు కుమార్ పరారయ్యారు. తమ సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే నిందితుల్లో ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నట్లు గుర్తించిన దర్యాప్తు బృందం, సోషల్ మీడియా విశ్లేషణ, సెల్ టవర్ లొకేషన్, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో వారి కదలికలను గుర్తించింది.ఈ నెల 20న ప్రొద్దుటూరు శివారులోని రెండుకోలయాల సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఉపాధికి సంబంధించిన వివాదం నేపథ్యంలో నైలాన్ తాడుతో మున్నా కుమార్ గొంతు బిగించి హత్య చేసినట్లు, అనంతరం ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ విభూ కృష్ణ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ఎం. నాగభూషణ్, ఎస్‌ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బీహార్, విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టి, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశాయి.మూడు నెలలుగా పరారీలో ఉన్న నిందితులను ఇన్‌స్టాగ్రామ్ క్లూతో పాటు సాంకేతిక ఆధారాల సాయంతో గుర్తించి అరెస్టు చేసిన రూరల్ సీఐ ఎం. నాగభూషణ్, ఎస్‌ఐ శ్రీకాంత్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఏఎస్పీ విభూ కృష్ణ అభినందించారు.
