–ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సీఐటీయూ నాయకుల విజ్ఞప్తి
సలాం ప్రొద్దుటూరు (మంగంపేట):
జూలై 2న మంగంపేటకు విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ఏపీఎండీసీ సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, ట్రైనీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారిని వెంటనే శాశ్వత ఉద్యోగులుగా (పర్మినెంట్) నియమించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్. చంద్రశేఖర్, ఆర్. వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.బుధవారం కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఏపీఎండీసీ సంస్థ ఏర్పాటుకు మంగంపేట ప్రాంత ప్రజలు తమ ఇళ్లు, భూములను త్యాగం చేశారని, నేడు సంస్థ కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ, ఆ అభివృద్ధికి కారణమైన నిర్వాసిత కుటుంబాలు మాత్రం ఇంకా ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ప్రభుత్వం, ఏపీఎండీసీ యాజమాన్యం నిర్వాసిత కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దాదాపు 15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్, ట్రైనీ కార్మికులుగానే కొనసాగిస్తూ అతి తక్కువ వేతనాలతో పనిచేయిస్తున్నారని విమర్శించారు.ఏపీఎండీసీ సంస్థలో సుమారు 400 శాశ్వత పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క నిర్వాసిత కార్మికుడినీ పర్మినెంట్ చేయకపోవడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు.మంగంపేట ప్రజల త్యాగాలను గుర్తించి, ఏపీఎండీసీ సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, ట్రైనీ కార్మికులందరినీ వెంటనే శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని సీఐటీయూ నాయకులు కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని నిర్వాసిత కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
