సలాం ప్రొద్దుటూరు:
కడప జిల్లా ముద్దుబిడ్డ శ్రీచరణి క్రికెట్ లో దూసుకెళ్తోంది. క్రికెట్ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే తన బౌలింగ్ లో అద్భుతాలు సృష్టిస్తోంది. ఐసీసీ టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.భారత యువ స్పిన్నర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గతేడాది టీమిండియా తరపున అరంగేట్రం చేసిన వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి… ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో నిలకడగా రాణిస్తోంది. ప్రపంచకప్ లో ఆడిన మూడు మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టిన శ్రీచరణి… అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ శ్రీచరణి 753 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్ కు చేరగా… చార్లీ డీన్ (733 పాయింట్లు; ఇంగ్లండ్), లిన్సే స్మిత్ (726 పాయింట్లు; ఇంగ్లండ్), ఎకిల్స్టోన్ (722 పాయింట్లు; ఇంగ్లండ్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ (708 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో ఉంది. గతంలో భారత్ నుంచి దీప్తి నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకోగా… ఇప్పుడు శ్రీచరణి ఏడాది కెరీర్ లోనే ఆ ఘనత సాధించింది. 21 ఏళ్ల శ్రీచరణి భారత్ తరపున 21 వన్డేల్లో 27 వికెట్లు… 23 టి20ల్లో 38 వికెట్లు పడగొట్టింది. తాజా ప్రపం చకప్ పాకిస్తాన్ పై 3వికెట్లు తీసిన ఈ ఆంధ్ర అమ్మాయి… నెదర్లాండ్ పై 4 వికెట్లు… దక్షిణాఫ్రికాపై 3 వికెట్లతో సత్తా చాటింది. బ్యాటింగ్ లో భారత్ నుంచి స్మృతి మంధాన (749 పాయింట్లు) ఐదో ర్యాంక్ లో… షఫాలీ వర్మ ఆరో ర్యాంక్లో, హర్మన్ ప్రీత్ పదో ర్యాంక్లో ఉన్నారు.
