ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్ఖాకీ చాటున గంజాయి దందా.. కడపలో హోమ్ గార్డ్ అరెస్ట్

ఖాకీ చాటున గంజాయి దందా.. కడపలో హోమ్ గార్డ్ అరెస్ట్

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (కడప):

సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, తప్పుడు మార్గంలో వెళ్లేవారిని సన్మార్గంలో పెట్టాల్సిన ఒక హోమ్ గార్డ్, అత్యాశకు పోయి గంజాయి స్మగ్లర్‌గా మారిన ఉదంతం కడప జిల్లాలో వెలుగుచూసింది. విధి నిర్వహణలో ఉంటూనే కాకీ యూనిఫామ్ చాటున గుట్టుచాపుగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న హోమ్ గార్డును, అతని సహచరుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఒడిస్సా నుంచి కడపకు రవాణా

పోలీసుల కథనం ప్రకారం… కడపలోని ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన కటిగండ్ల రమేష్ బాబు కడప కమాండ్ కంట్రోల్‌లో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సులభంగా, ఎక్కువగా డబ్బు సంపాదించాలనే దురాశతో అతను గంజాయి స్మగ్లింగ్ బాట పట్టాడు. ఇందుకోసం రమేష్ బాబు గత ఆరు నెలలుగా విధులకు తరచుగా సెలవులు పెడుతూ, తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో ఒడిస్సా సరిహద్దు గ్రామాలకు వెళ్లేవాడు. అక్కడ కిలో గంజాయిని రూ. 3 వేల నుండి రూ. 5 వేల చొప్పున కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా కడపకు తీసుకువచ్చేవాడు. ఇక్కడ ఆ గంజాయిని కిలో రూ. 20 వేల నుండి రూ. 30 వేల వరకు విక్రయించేవాడు.

చిన్న పొట్లాలుగా మార్చి విక్రయాలు

రమేష్ బాబు ఒడిస్సా నుండి తెచ్చిన గంజాయిని సికే దిన్నె మండలం ఇందిరానగరకు చెందిన చిలకల ఛాన్ భాషా అనే వ్యక్తికి అప్పగించేవాడు. ఛాన్ భాషా, అతని భార్య సుబ్బమ్మ అలియాస్ ప్యారీ మరికొందరితో కలిసి ఆ గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా (ప్యాకెట్లుగా) తయారు చేసేవారు. ఆ ప్యాకెట్లను కడప పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు, యువతకు భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవారు.

నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు

రమేష్ బాబు తరచుగా సెలవులు పెట్టి ఒడిస్సా వైపు వెళ్తుండటాన్ని గమనించిన పోలీస్ ఉన్నతాధికారులు అతనిపై నిఘా పెట్టారు. కడప ఇంచార్జ్ డిఎస్పి బాలస్వామి రెడ్డి, చిన్నచౌకు సిఐ రామకృష్ణ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం అతని కదలికలను నిరంతరం పర్యవేక్షించింది. ఈ క్రమంలో ఒడిస్సా నుండి గంజాయిని కడపకు తరలిస్తుండగా పోలీసులు రమేష్ బాబును, అతనికి సహకరిస్తున్న ఛాన్ భాషాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒడిస్సాకు చెందిన ఇద్దరు సరఫరాదారులను కూడా ట్రాక్ చేసి అరెస్ట్ చేస్తామని, గంజాయి బారిన పడిన స్థానిక వినియోగదారులను గుర్తించి వారికి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని కడప అడిషనల్ ఎస్పి ప్రకాష్ బాబు మీడియాకు వెల్లడించారు.

 

పోలీసుల విజ్ఞప్తి:

 

గంజాయి వంటి మాదక ద్రవ్యాల విక్రయాలు, నిల్వలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 112 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏపీ పోలీసులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!