–తొండూరు హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
సలాం ప్రొద్దుటూరు – తొండూరు:
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మచ్చా వెంకట రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, విద్యారంగానికి అందించిన సేవలు, దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరిస్తూ “తల్లి జన్మనిస్తే.. తండ్రి లోకాన్ని చూపిస్తే.. ఉపాధ్యాయుడు ఆ లోకంలో ఎలా జీవించాలో నేర్పిస్తాడు” అని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.
అనంతరం విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను దుశ్శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువుల పట్ల ఉన్న గౌరవం, అభిమానాన్ని చాటుకున్నారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
