బీసీ నాయకుడినైన నాపై దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు?
టీడీపీ, వైఎస్సార్‌సీపీ బీసీలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. బీసీలుగా ఐక్యంగా ఉండాలి
– మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్
సలాం ప్రొద్దుటూరు:
ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత మూడు నాలుగు రోజులుగా బీసీ సోదరుడు చల్లా రాజగోపాల్‌కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్ అన్నారు.
చల్లా రాజగోపాల్‌ను ఉద్దేశించి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఈ అంశంపై ప్రొద్దుటూరులో బీసీ సంఘాల పేరుతో కొందరు నిర్వహించిన చర్చా వేదికలో మాట్లాడిన వారిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నవారేనని ఆయన పేర్కొన్నారు.
“బీసీ సంఘాలు అంటే టీడీపీకి సంబంధించిన బీసీ సంఘాలేనా? లేక ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అన్ని బీసీ కులాలను, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కలుపుకుని ఏర్పడిన సంఘాలా?” అని శేఖర్ యాదవ్ ప్రశ్నించారు.
నాపై దాడి జరిగినప్పుడు బీసీ సంఘాలు ఎక్కడున్నాయి?
తాను బీసీ సామాజికవర్గానికి చెందిన యాదవుడినని, తనపై జరిగిన దాడి విషయంలో బీసీ సంఘాల నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన పట్టా భూమిలో నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు శివచంద్రారెడ్డి తనపై దాడి చేసి గాయపరిచారని శేఖర్ యాదవ్ ఆరోపించారు.
తన భూమికి సంబంధించిన వివాదంలో తన కుటుంబంపై జరిగిన ఘటనపై బీసీ సంఘాల నాయకుల్లో ఒక్కరు కూడా ముందుకు వచ్చి “ఇది న్యాయమా? అన్యాయమా? ధర్మమా? అధర్మమా?” అని ప్రశ్నించలేదని అన్నారు. సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆ సమయంలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి , బంగారు రెడ్డి అక్కడికి వచ్చి నిర్మాణ పనులకు సహకరించారని, ఆ సమయంలో బీసీ సోదరులు ఎక్కడ ఉన్నారని శేఖర్ యాదవ్ ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నవారికే బీసీ సంఘాల మద్దతా?
ధనవంతులు, బలవంతులు లేదా అధికార పార్టీలో ఉన్నవారికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే బీసీ సంఘాలు సమావేశాలు నిర్వహిస్తే, సామాన్య బీసీలకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వేలాది మంది పేద బీసీలు వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అగ్రవర్ణాల చేతిలో ఇబ్బందులు పడుతున్న బీసీల కోసం కూడా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీలు వేరు.. బీసీలుగా మనం ఒక్కటే
తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, కొందరు టీడీపీలో ఉన్నారని పేర్కొంటూ, “మీ పార్టీలో మీ రాజకీయ పాత్ర మీరు పోషించండి.. మా పార్టీలో మా రాజకీయ పాత్ర మేము పోషిస్తాం. కానీ బీసీల సమస్యల విషయంలో మాత్రం మనమంతా ఒక్కటిగా ఉండాలి” అని శేఖర్ యాదవ్ సూచించారు.
బీసీ సంఘాలు అన్ని పార్టీలకు, అన్ని వర్గాలకు చెందినవిగా చెప్పుకునే ముందు ఆచరణలో కూడా అదే విధంగా వ్యవహరించాలని కోరారు. బీసీల మధ్య పరస్పర విభేదాలు సృష్టించి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల చివరకు నష్టం బీసీలకే జరుగుతుందని అన్నారు.
బీసీ సోదరులంతా పరస్పరం సహకరించుకుంటూ, సమాజానికి సేవ చేసే విధంగా ముందుకు సాగాలని శేఖర్ యాదవ్ పిలుపునిచ్చారు.
