ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్జగన్ మాటే.. రాచమల్లు బాట..

జగన్ మాటే.. రాచమల్లు బాట..

📰 Generate e-Paper Clip

 

– మావిగన్‌పై జగన్ నిర్ణయానికి మద్దతు..

–అమరావతి విధానంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

 

సలాం ప్రొద్దుటూరు :

 

“జగన్ మాటే… రాచమల్లు బాట” అని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి చెప్పిన మాట, తీసుకున్న నిర్ణయానికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. గురువారం దొరసానిపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

ప్రజల అభిప్రాయమే వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి అభిప్రాయమని, “జగన్ చెప్పిందే మా విధానం.. ప్రజల ఆకాంక్షలను గౌరవించడమే మా పార్టీ సిద్ధాంతం” అని రాచమల్లు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఏది కోరుకుంటే అదే వైఎస్సార్‌సీపీ నిర్ణయమని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు, అనవసర రాజకీయ వ్యాఖ్యలతో రాష్ట్రానికి ప్రయోజనం లేదని, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

 

అమరావతి రాజధాని నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో స్పష్టత లేదని ఆయన విమర్శించారు. అవసరానికి మించిన విస్తీర్ణంలో రూ.2 లక్షల కోట్లకు పైగా వ్యయం చేసి రాజధాని నిర్మించడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర భారం మోపుతుందని అన్నారు. తక్కువ భూమిలో, తక్కువ వ్యయంతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాజధానిని అభివృద్ధి చేయడం సమంజసమని అభిప్రాయపడ్డారు.

 

ఏడేళ్లలో 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోయారని, మూడు పంటలు పండే సారవంతమైన భూములను ఈ విధంగా వినియోగించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని రాజధానిని నిర్మిస్తే ప్రభుత్వంపై అదనపు అప్పుల భారం తగ్గుతుందని సూచించారు.

 

మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తామంతా పూర్తిగా సమర్థిస్తున్నామని రాచమల్లు తెలిపారు. గతంలో ప్రకటించిన అభిప్రాయానికే కట్టుబడి ఉండటం జగన్ నీతి, నిజాయితీకి నిదర్శనమని కొనియాడారు. “ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేడు. జగన్ నాయకత్వం మా గర్వకారణం” అని అన్నారు.

 

మావిగన్ ప్రాంతంలో రూ.10 వేల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయంతోనే ప్రజలకు అందుబాటులో ఉండే రాజధానిని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

రాబోయే ఎన్నికల్లో మావిగన్ మా రాజధాని ,    సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రానికి సంపద సృష్టి, శాంతిభద్రతల పరిస్థితి వంటి అంశాలనే ప్రజల ముందుకు తీసుకెళ్తామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. రాజధాని నిర్మాణం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల అవసరాలు, రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!