ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన రిమాండ్ ఖైదీఎట్టకేలకు రెండు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు

పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన రిమాండ్ ఖైదీఎట్టకేలకు రెండు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (గుంటూరు):

మార్చి 28న గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ ఎట్టకేలకు రెండు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. సైబర్ నేరాలకు పాల్పడడంలో దిట్టగా పేరుగాంచిన అజిత్ కుమార్‌ను పలు మోసాల కేసుల్లో పోలీసులు గతంలో పలుమార్లు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అజిత్ కుమార్ ప్రధానంగా ఓఎల్ఎక్స్ వేదికగా మోసాలకు పాల్పడేవాడు. గతంలో ఒంగోలు పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న సమయంలో అనారోగ్యాన్ని సాకుగా చూపి ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం కొంతకాలం పోలీసులకు చిక్కకుండా తిరిగిన అతడిని విజయవాడ పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒంగోలు జైలుకు పీటీ వారెంట్‌పై తరలించిన సమయంలో పాత కేసు నేపథ్యంలో తెనాలి పోలీసులు అతడిని తమ కస్టడీలోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో అజిత్ కుమార్‌ను రేపల్లే సబ్‌జైలుకు తరలించారు.

రేపల్లె సబ్‌జైలులో ఉన్నప్పుడే పరారయ్యేందుకు అజిత్ కుమార్ పక్కా ప్రణాళిక రచించినట్లు విచారణలో తేలింది. జైలర్ నుంచి ఎస్కార్ట్ సిబ్బంది వరకు పలువురికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగా అనారోగ్యాన్ని సాకుగా చూపి మొదట రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో ఫోన్ ద్వారా బయట ఉన్న వ్యక్తులతో సంప్రదింపులు జరిపి పరారీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం టిఫిన్ తీసుకురావాలంటూ ఎస్కార్ట్ సిబ్బందిలో ఒకరికి రూ.500 ఇచ్చి బయటకు పంపించాడు. అనంతరం మరో కానిస్టేబుల్‌కు వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చి ఆటోలో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

గతంలో కూడా ఇదే తరహాలో ఆసుపత్రి నుంచి తప్పించుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేసి ప్రత్యేక విచారణ చేపట్టారు. విచారణలో ఎస్కార్ట్ సిబ్బందికి లంచాలు ఇచ్చి పరారైనట్లు తేలడంతో జైలు, పోలీసు శాఖలకు చెందిన మొత్తం పది మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. పరారీ అనంతరం అజిత్ కుమార్ ఫోన్ వినియోగించకుండా తరచూ స్థావరాలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో అతడిని గుర్తించి పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ లో అజిత్ కుమార్ వివరాలను గుంటూరు పోలీసులు నమోదు చేయడంతో అతడి కదలికలపై నిఘా కొనసాగించారు.

ఇటీవల తమిళనాడులోని తిరుప్పూర్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కేసులో అజిత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడి వివరాలు సీసీటీఎన్‌ఎస్‌లో నమోదై ఉండటంతో ఆ సమాచారాన్ని గుంటూరు పోలీసులకు అందించారు. దీంతో గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని తిరుప్పూర్‌కు వెళ్లి అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు రెండు నెలలుగా పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన భీముడు అజిత్ కుమార్ ఎట్టకేలకు చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అతడిని ఈ సాయంత్రం గుంటూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!