సలాం ప్రొద్దుటూరు:
ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలను పటిష్ఠం చేయడం, నేరాల నివారణపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రొద్దుటూరు రూరల్ రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని డి-కేటగిరీ ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన చిన్నశెట్టిపల్లిలో ప్రత్యేక గ్రామసభతో పాటు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ నాగభూషణ్ గ్రామస్థులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలు, గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలు వెల్లడించిన సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి పోలీసు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, అత్యవసర సేవల కోసం డయల్-112 వినియోగం, మహిళలు మరియు పిల్లల భద్రత, ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.అనంతరం నిర్వహించిన “పల్లెనిద్ర” కార్యక్రమంలో గ్రామస్థులతో మమేకమైన సీఐ నాగభూషణ్ గ్రామంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఎలాంటి సమాచారం ఉన్నా నిర్భయంగా సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాజుపాలెం ఎస్‌ఐ ప్రణయ్ రెడ్డి, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

