–విద్యార్థి, యువతకు ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శం
–PRSYF రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు
సలాం ప్రొద్దుటూరు – కడప:
భారత స్వాతంత్ర పోరాటంలో యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు షాహిద్ భగత్‌సింగ్ అని, నేటి విద్యార్థి, యువజనులు ఆయన దేశభక్తి, త్యాగం, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం (PRSYF) రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు పిలుపునిచ్చారు.షాహిద్ భగత్‌సింగ్ జయంతి సందర్భంగా సోమవారం కడప నగరంలోని శ్రీ బాలాజీ వొకేషనల్ జూనియర్ కళాశాలలో PRSYF ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా భగత్‌సింగ్ తన జీవితాన్ని దేశ స్వాతంత్య్రం కోసం అంకితం చేశారని అన్నారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదంతో యువతలో స్వేచ్ఛా కాంక్షను రగిలించిన భగత్‌సింగ్, కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.భగత్‌సింగ్ ఆలోచనలు, ఆశయాలు, పోరాట పటిమ తరతరాల యువతకు స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే విప్లవ భావాలకు ఆకర్షితుడైన భగత్‌సింగ్‌ను నేటి విద్యార్థి, యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా చైతన్యవంతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.భగత్‌సింగ్ త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఆయన దేశభక్తి, ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి నిరంతర స్ఫూర్తి దీప్తిగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో PRSYF నగర నాయకులు వెంకటేష్, మన్సూర్, బాలాజీ, బాబా ఫక్రుద్దీన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
