–కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వినతి
సలాం ప్రొద్దుటూరు – పొట్లదుర్తి:
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కడప జిల్లా పర్యటనలో భాగంగా కడపలో నూతనంగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని శనివారం సందర్శించారు. అనంతరం పొట్లదుర్తి గ్రామంలో సీఎం సురేష్ నాయుడును పరామర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి ను మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మచిలీపట్నం–విజయవాడ నుంచి నంద్యాల, ప్రొద్దుటూరు, అనంతపురం మీదుగా బెంగళూరుకు రైలు సౌకర్యం కల్పించాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి బెంగళూరుకు నేరుగా రైలు కనెక్టివిటీ లేకపోవడంతో కడప, కర్నూలు, నంద్యాల, ప్రొద్దుటూరు, అనంతపురం జిల్లాల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వివరించారు.ప్రస్తుతం మచిలీపట్నం, విజయవాడ నుంచి గుత్తి మీదుగా బెంగళూరుకు రైళ్లు నడుస్తున్నాయని, అదే మార్గాన్ని నంద్యాల–ప్రొద్దుటూరు–యర్రగుంట్ల మీదుగా అనుసంధానించే విధంగా రైళ్లను మళ్లించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కల్పించవచ్చని సూచించారు.
కొత్త రైల్వే లైన్ కంటే ఉన్న మార్గం వినియోగమే సులభతరం
కడప నుంచి బెంగళూరు వరకు చేపట్టిన కొత్త రైల్వే మార్గంలో ప్రస్తుతం పెండ్లిమర్రి వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం మార్గం నిర్మాణానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, తక్షణ ప్రయోజనం కోసం ఇప్పటికే ఉన్న రైల్వే మార్గాన్ని వినియోగించుకోవడం ద్వారా బెంగళూరుకు రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
గతంలో ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ, రాయచోటి మీదుగా ప్రతిపాదించిన రైల్వే మార్గం కూడా అమలు కాలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే మార్గాల ఆధారంగా కొత్త రైలు సర్వీసును ఏర్పాటు చేయడం ప్రయాణికులకు త్వరితగతిన ప్రయోజనం చేకూర్చే మార్గమని వివరించారు.
కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను మళ్లించే అవకాశం
బెంగళూరు నుంచి నంద్యాల వరకు ఇప్పటికే పలు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో, కొండవీడు ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 17211) వంటి రైళ్లను మచిలీపట్నం–నంద్యాల–ప్రొద్దుటూరు–యర్రగుంట్ల–గుత్తి–అనంతపురం మీదుగా బెంగళూరుకు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.
అదేవిధంగా విజయవాడ నుంచి నంద్యాల, ప్రొద్దుటూరు, గుత్తి మీదుగా బెంగళూరుకు ప్రత్యేకంగా కొత్త రైలు సర్వీసును ప్రారంభించాలని కోరుతూ 2026 మార్చి నెలలో తాను వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ సమర్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఈ రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే కడప, నంద్యాల, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, గుత్తి, అనంతపురం ప్రాంతాల ప్రజలకు బెంగళూరుతో మెరుగైన రైల్వే అనుసంధానం ఏర్పడటంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.


