–₹లక్ష విలువైన కేబుల్స్ చోరీ.. 68 కిలోల కేబుల్స్ స్వాధీనం
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలోని ఎస్‌ఎస్ మాల్ సమీపంలో ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను ప్రొద్దుటూరు III టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 68 కిలోల ఎలక్ట్రికల్ కేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల మేరకు.. సెప్టెంబర్ 24న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రొద్దుటూరు పట్టణం కొమ్మపాడు రోడ్డులోని ఎస్‌ఎస్ మాల్ దక్షిణ వైపున ఉన్న సందులో, గోడకు ఆనించి ఉంచిన ఎలక్ట్రికల్ కేబుల్ వైర్ నుంచి సుమారు 85 మీటర్ల కేబుల్స్‌ను కట్ చేసి దొంగిలించారు. దొంగిలించిన కేబుల్స్‌లో కాపర్ వైర్ ఉండటంతో వాటి విలువ సుమారు రూ.1 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఎస్‌ఎస్ మాల్ నైట్ సెక్యూరిటీ గార్డు గుర్తించి మేనేజర్‌కు సమాచారం అందించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 25న ప్రొద్దుటూరు III టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
పోలీసుల చాకచక్యంతో పట్టుబడ్డ నిందితులు
ఫిర్యాదు మేరకు III టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి. రామాంజనేయుడు ఆదేశాల మేరకు ఎస్‌ఐ టి. సంజీవ రెడ్డి మరియు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 27న తెల్లవారుజామున బైపాస్ రోడ్డులోని TVR పెట్రోల్ బంక్ వద్ద ముగ్గురు వ్యక్తుల కదలికలను పోలీసులు గుర్తించారు.పోలీసులను గమనించిన వారు తమ వద్ద ఉన్న ఎలక్ట్రికల్ వైర్ చుట్టలను కింద పడేసి పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఎస్‌ఎస్ మాల్ నుంచి ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ చేసినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 68 కిలోల ఎలక్ట్రికల్ కేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను ఆదివారం హాజరుపరిచి, తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలకు పోలీసుల సూచన
ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రదేశాల్లో నిల్వ ఉంచే ఎలక్ట్రికల్ కేబుల్స్, ఇతర విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
