–టౌన్ బ్యాంక్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు..
– ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు
–సీసీ కెమెరా ఫుటేజీ, బ్యాంకు రికార్డులు పరిశీలించండి..
–ఆరోపణలు నిజమని తేలితే రాజకీయ, వృత్తి జీవితాన్ని వదులుకుంటా
– టీడీపీ సీనియర్ నాయకులు ఈ.వి. సుధాకర్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
టౌన్ బ్యాంక్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను బ్యాంకుకు వెళ్లలేదని, సంబంధిత నగదు లావాదేవీల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు ఈ.వి. సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలను బ్యాంకు రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీ, సంబంధిత పత్రాలతో నిరూపించాలని సవాల్ చేశారు. శనివారం నెహ్రూ రోడ్డు లో నీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తాను బ్యాంకుకు వెళ్లినట్లు లేదా సంబంధిత డబ్బులో తనకు ఒక్క రూపాయి అయినా అందినట్లు నిరూపిస్తే రాజకీయ, వృత్తి జీవితాన్ని శాశ్వతంగా వదులుకోవడమే కాకుండా కట్టుబట్టలతో ఈ ఊరు వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అవసరమైతే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ప్రజలే నా బలం..
తనపై వస్తున్న రాజకీయ, వ్యక్తిగత విమర్శలపై సుధాకర్ రెడ్డి స్పందిస్తూ.. తనకు ఎవరూ శత్రువు కాదని, ఎవరినీ శత్రువులుగా భావించనని అన్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో స్నేహపూర్వకంగా మాట్లాడటం తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కొనసాగుతున్న విధానమని తెలిపారు.“నాకు ఎవరూ ప్రత్యేకం కాదు.. అలాగే నేను ఎవరికీ ప్రత్యేకం కాదు. నాకు శత్రువులు లేరు. అన్ని పార్టీల వారితో మాట్లాడుతాను, ప్రజలతో ఉన్న అనుబంధమే నా బలం” అని పేర్కొన్నారు.“ఇదే నా బలం.. ఇదే నా బలగం.. ఇదే నా ఆస్తి. ప్రజలు ఇచ్చిన మద్దతే నా రాజకీయ శక్తి” అని సుధాకర్ రెడ్డి అన్నారు.
పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులోనే
తాను 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండటం తన విధానమని తెలిపారు. కౌన్సిలర్‌గా, ఇంచార్జి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు.ఇప్పటికీ ప్రతిరోజూ ప్రజలను కలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ, పోలీస్, ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపాలిటీ తదితర శాఖల అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు.
పార్టీ ఆదేశాలకే కట్టుబడి పనిచేశా
2014 ఎన్నికల్లో పార్టీ తరఫున పనిచేశానని, అనంతరం ఏర్పడిన రాజకీయ, వ్యక్తిగత విభేదాల కారణంగా కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అయినప్పటికీ టీడీపీకి కట్టుబడి పనిచేశానని, 2019 ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థికి మద్దతుగా పనిచేశానని తెలిపారు.2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీని వీడకుండా కార్యకర్తగా పనిచేశామని పేర్కొన్నారు.
మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలిచా
ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపైనా సుధాకర్ రెడ్డి స్పందించారు. సంబంధిత వ్యక్తి మృతికి ముందు కొన్ని కారణాలను ఉత్తరంలో పేర్కొన్నారని, అందులో కుటుంబానికి సంబంధించిన అంశాలతో పాటు మరికొన్ని విషయాలు ఉన్నాయని తెలిపారు.మరణం అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తన వంతు సహాయం చేసినట్లు చెప్పారు. “వారికి జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేనప్పటికీ, నా బాధ్యతగా భావించి కుటుంబానికి సహాయం చేశాను. ఇప్పటికీ వారితో నాకు సంబంధాలు ఉన్నాయి” అని అన్నారు.
శవాన్ని ఇంటికి తీసుకొచ్చారన్నది అవాస్తవం
మృతదేహాన్ని తన ఇంటికి తీసుకొచ్చారని, అక్కడ గొడవ జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.“నా ఇంటి వద్ద అలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. శవాన్ని నా ఇంటికి తీసుకువచ్చారన్నది అవాస్తవం. ఆ రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పాను” అని తెలిపారు.సంబంధిత కేసు న్యాయపరమైన ప్రక్రియలో ఉన్నప్పటికీ తాను బాధ్యత నుంచి తప్పుకోకుండా కుటుంబానికి సహాయం చేశానని చెప్పారు.
టౌన్ బ్యాంక్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు
టౌన్ బ్యాంక్ వ్యవహారంపై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉషారాణి, సుచరిత తండ్రి సుబ్బారాయుడు మృతి చెందిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు తనను సంప్రదించారని తెలిపారు.ఆ వ్యవహారంలో కోర్టు ద్వారా నష్టపరిహారం వచ్చేలా న్యాయపరమైన సహాయం చేసినట్లు చెప్పారు. నష్టపరిహారం దశలవారీగా వచ్చిన సమయంలో ఉషారాణి, సుచరిత తన వద్దకు వచ్చి బ్యాంకు ఖాతాలు తెరవడానికి పరిచయం ఇవ్వాలని కోరారని తెలిపారు.
‘ఖాతా ప్రారంభానికి పరిచయం ఇచ్చింది వాస్తవమే’
ఉషారాణి, సుచరిత ఖాతాలు తెరవడానికి తాను పరిచయదారుడిగా సంతకం చేసిన విషయం వాస్తవమేనని సుధాకర్ రెడ్డి చెప్పారు.“వారి ఖాతా ప్రారంభానికి నేను పరిచయం ఇచ్చాను. కానీ ఆ తర్వాత జరిగిన బ్యాంకు లావాదేవీలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వారిద్దరూ చదువుకున్నవారు, తమ వ్యవహారాలు తామే నిర్వహించుకోగలరు” అని తెలిపారు.కోర్టు నుంచి నిధులు బ్యాంకుకు బదిలీ అయిన తర్వాత సంబంధిత ఖాతాదారులే తమ ఖాతాలను నిర్వహించుకున్నారని పేర్కొన్నారు.
‘నేను బ్యాంకుకు వెళ్లలేదు’
తాను బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేశానని లేదా లావాదేవీలు నిర్వహించానని చేస్తున్న ఆరోపణలను సుధాకర్ రెడ్డి ఖండించారు.“నేను ఏనాడూ టౌన్ బ్యాంకుకు వెళ్లలేదు. ఆ రూ.11.50 లక్షల్లో నాకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. బ్యాంకు రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుంది” అని అన్నారు.
కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధం
తనపై వచ్చిన ఆరోపణలు నిజమని చెప్పేవారు ఆధారాలతో నిరూపించాలని, అవసరమైతే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుధాకర్ రెడ్డి ప్రకటించారు.“నాకు దేవుడంటే భయం, భక్తి ఉంది. నేను టౌన్ బ్యాంకుకు వెళ్లానని, ఆ డబ్బులో నాకు ఒక్క రూపాయి అయినా ముట్టిందని నిరూపిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు.
నిరూపిస్తే రాజకీయ, వృత్తి జీవితాన్ని వదులుకుంటా
తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ, వృత్తి జీవితాన్ని శాశ్వతంగా వదులుకుంటానని సుధాకర్ రెడ్డి సవాల్ చేశారు.“నేను బ్యాంకుకు వెళ్లానని, ఆ రూ.11.50 లక్షల్లో నాకు ఒక్క రూపాయి అయినా అందిందని నిరూపించగలిగితే నా రాజకీయ, వృత్తి జీవితాన్ని వదులుకుంటాను. నా ఆస్తులను సైతం మీ పేరుతో బదలాయించేందుకు సిద్ధంగా ఉన్నాను. కట్టుబట్టలతో ఈ ఊరు వదిలి వెళ్లడానికి కూడా సిద్ధం” అని అన్నారు.ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా సీసీ కెమెరా ఫుటేజీ లేదా ఇతర ఆధారాలతో ఆరోపణలు నిరూపించినా తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని తెలిపారు.
అధికారులతో విచారణ జరపాలని నేనే కోరుతా
తనపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని తానే కోరనున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు.“బ్యాంకు రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీ, ఖాతా వివరాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు పరిశీలించండి. వాస్తవాలు ప్రజల ముందుకు రావాలి. విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను” అని స్పష్టం చేశారు.తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ విమర్శలుగా కాకుండా ఆధారాలతో, విచారణ ద్వారా తేల్చాలని ఈ.వి. సుధాకర్ రెడ్డి కోరారు.
