–రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో బరిలోకి దిగుతాం
–డా. నర్రెడ్డి తులసిరెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు, పౌర సంఘాలతో కలిసి అన్ని చోట్లా పోటీ చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డా. నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు.ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో విస్తృతంగా పోటీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి పీపీ.వీ. మోహన్ అధ్యక్షత వహించగా, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, ఏఐసీసీ జాయింట్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి గణేష్ కుమార్ యాదవ్ జూమ్ ద్వారా పాల్గొన్నారని తెలిపారు.
మిత్రపక్షాలతో చర్చలకు త్రిసభ్య కమిటీ
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఇతర మిత్రపక్షాలు, పౌర సంఘాలతో చర్చలు జరిపేందుకు త్వరలో పీసీసీ స్థాయిలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తులసిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఒక్కో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని పీసీసీ తరఫున ఇన్‌చార్జిగా నియమిస్తామని చెప్పారు.జిల్లా ఇన్‌చార్జిలు ఆయా జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారని వివరించారు.
ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు కోరుతామని తులసిరెడ్డి అన్నారు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్రాల్లోని కూటమి ప్రభుత్వాల వైఫల్యాలను, ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ విఫలమైన తీరును ప్రజలకు వివరిస్తామని తెలిపారు.“కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. సామాజిక న్యాయం కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు.ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 25 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం, ముస్లింలకు 4 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ కల్పించిందని తులసిరెడ్డి పేర్కొన్నారు.
రాజస్థాన్ ఫలితాలు స్ఫూర్తి
రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి స్ఫూర్తినిచ్చాయని తులసిరెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పారు.ఆ ఫలితాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో గత ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పూల నజీర్, ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జిలాని భాష, ఖాజాపీర్, అలీ, జావిద్, ఉత్తన్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, చాగలేటి వెంకటేశు, ఐచర్ రమణ, చిన్నకోట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు డా. తులసిరెడ్డికి ఘన స్వాగతం పలికారు.
