ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిప్రొద్దుటూరుకు రూ.61 కోట్ల అభివృద్ధి బాట!

ప్రొద్దుటూరుకు రూ.61 కోట్ల అభివృద్ధి బాట!

📰 Generate e-Paper Clip

–₹12 కోట్లతో 50 పనులకు శ్రీకారం..

–త్వరలో మరో రూ.49 కోట్ల నిధులు  ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

–ప్రజా ఫిర్యాదుల ఆధారంగా ప్రాధాన్యతా జాబితా..

–దశలవారీగా పనులు: కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు.  ₹ 12 కోట్లతో చేపట్టనున్న 50 రోడ్లు, కాలువల అభివృద్ధి పనులకు ఆదివారం పలు వార్డుల్లో భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశలో ఆరు ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.12 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ప్రారంభించిన పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

త్వరలో మరో రూ.49 కోట్ల నిధులు ప్రొద్దుటూరుకు మంజూరు కానున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నిధులతో పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో పట్టణానికి అవసరమైన నిధులను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.రోడ్ల అభివృద్ధితో పాటు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వరదరాజుల రెడ్డి తెలిపారు. రామేశ్వరం వరకు రహదారికి ఇరువైపులా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎస్టిమేట్లు సిద్ధం చేసి టెండర్ ప్రక్రియను చేపట్టినట్లు చెప్పారు. పురపాలక పరిధిలోని ప్లాట్ల విక్రయాలను కూడా త్వరలో  ప్రారంభిస్తామన్నారు.

ప్రస్తుతం ప్రారంభించిన పనులను రెండు నెలల్లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్, సిబ్బంది సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుత రోడ్ల పనులు పూర్తయిన అనంతరం అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్లకు కూడా టెండర్లు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.

ప్రజా ఫిర్యాదుల ఆధారంగా ప్రాధాన్యతా జాబితా: కమిషనర్

మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ప్రాధాన్యతా జాబితాను రూపొందించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారని చెప్పారు.

ఎమ్మెల్యే సూచనల మేరకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, దశలవారీగా పనులను చేపడుతున్నామని కమిషనర్ వివరించారు. రూ.12 కోట్లతో చేపట్టిన 50 అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు పారదర్శకంగా అందేలా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలు చేస్తున్న తల్లికి వందనం, దీపం–2, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్యసేవ వంటి సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం అధికారుల ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ సమస్య ఎదురైనా మున్సిపాలిటీ ద్వారా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నిస్వార్థంగా, నిజాయితీగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

పట్టణాన్ని ఆధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిచి ప్రొద్దుటూరు పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. అన్ని వార్డుల్లో అవసరమైన పనులను గుర్తించి దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

పలువురు ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, షేక్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వీఎస్ ముక్తియార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి, పురపాలక ఇంజనీర్ శ్రీనివాసులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబివుల్లా, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!