–లోకేశ్ రాజీనామా చేయాలి..
–స్పోర్ట్స్ కోటా నియామకాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలి
–రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నా అక్రమాలు, అవినీతిపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం కు నిజాయితీ ఉంటే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నారు. విచారణకు ఆదేశించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే అనుమానాలకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.డీఎస్సీ పరీక్ష, నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారులను బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని రాచమల్లు ఆరోపించారు. కీలక సమయంలో పనిచేసిన అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేసి, కొత్త అధికారులను నియమించడం ద్వారా విచారణలో బాధ్యతలు తప్పించుకునే పరిస్థితి కల్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఆధారాలతో ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి
డీఎస్సీ నియామకాలకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి అక్రమాలపై ఆరోపణలు, ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయని రాచమల్లు తెలిపారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా, కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అంశాల్లో అనుమానాస్పద వ్యవహారాలు ఉన్నాయని ఆరోపించారు.నిజమైన క్రీడాకారులు, అర్హత కలిగిన అభ్యర్థులు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరిగేలా నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం జరిగితే అది అత్యంత తీవ్రమైన విషయమని అన్నారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలు రద్దు చేయాలి
స్పోర్ట్స్ కోటాలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరిగిన స్పోర్ట్స్ కోటా పరీక్షలు, నియామకాలను రద్దు చేసి, మొత్తం ప్రక్రియను పునఃసమీక్షించాలని కోరారు.నిజమైన క్రీడాకారులకు, ప్రతిభ ఆధారంగా ఉద్యోగం పొందాల్సిన యువతకు న్యాయం జరిగేలా స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి, పారదర్శకంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
యువత పోరాడాలి
ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన యువతకు అన్యాయం జరిగితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని రాచమల్లు అన్నారు. డీఎస్సీ వ్యవహారంపై యువత ప్రశ్నించాలని, న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని పిలుపునిచ్చారు.డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
“సీబీఐ విచారణ జరిపించాలి.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. స్పోర్ట్స్ కోటా నియామకాలను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌తో పారదర్శకంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలి” అని రాచమల్లు స్పష్టం చేశారు.
