
–మెగా రక్తదాన శిబిరంలో ప్రొద్దుటూరు పోలీసుల భాగస్వామ్యం
–ఏఎస్పీ విభు కృష్ణ సహా 27 మంది పోలీసు సిబ్బంది రక్తదానం
సలాం ప్రొద్దుటూరు:
విధి నిర్వహణలో ప్రజల భద్రతకు అంకితమవుతున్న ప్రొద్దుటూరు పోలీసులు.. సామాజిక సేవలోనూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ప్రొద్దుటూరు పట్టణంలోని రోటరీ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ విభు కృష్ణ ఐపీఎస్ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు.ఏఎస్పీతో పాటు వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి, ట్రాఫిక్ సీఐ భాస్కర్, వన్‌టౌన్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, టూటౌన్ ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డి, రాజుపాలెం ఎస్‌ఐ ప్రణయ్ కుమార్ రెడ్డితో పాటు ప్రొద్దుటూరు సబ్ డివిజన్‌కు చెందిన 27 మంది పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
ఈ సందర్భంగా ఏఎస్పీ విభు కృష్ణ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక అనేక మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి తరచూ రక్తం అవసరమవుతుందని, స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావడం ద్వారా అలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఆరోగ్యవంతుడు సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు ప్రజలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి అవసరమైన రోగులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రోటరీ క్లబ్ సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఏఎస్పీ విభు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.పోలీసుల విధి నిర్వహణకు సామాజిక సేవను జోడిస్తూ నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరం.. “ప్రజల రక్షణతో పాటు ప్రజాసేవలోనూ పోలీసులు ముందుంటారు” అనే సందేశాన్ని చాటిచెప్పింది.


