–నేత్రదానంపై చైతన్యానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపు
–జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం.. అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ
సలాం పులివెందుల:
మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం నేత్రదానంపై అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం పులివెందులలో స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. తన నివాసంలో నేత్రదాన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నేత్రదానం అత్యంత గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. అంధత్వ నివారణలో నేత్రదానం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నేత్రదానంపై ఉన్న అపోహలు, మూఢనమ్మకాలను తొలగించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది నేత్రదాతలు ముందుకు వచ్చేలా చేయాలని సూచించారు.మునిసిపల్ ఇన్‌చార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో స్నేహిత అమృత హస్తం సేవాసమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నేత్రదానం ద్వారా అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చని తెలిపారు. యువత, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
సేవాసమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ కుటుంబంలో ఎవరైనా మరణించిన వెంటనే 9966509364 నంబర్‌కు సమాచారం అందిస్తే సేవాసమితి ప్రతినిధులు పార్ధివదేహం వద్దకే చేరుకుని ఉచితంగా కార్నియాలను సేకరిస్తారని తెలిపారు. మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 4 నుంచి 6 గంటలలోపు కార్నియాలను సేకరించడం ద్వారా అవసరమైన వారికి చూపు అందించే అవకాశం ఉంటుందని వివరించారు.గత కొన్ని సంవత్సరాలుగా నేత్రదానంపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాజు తెలిపారు. వందలాది కుటుంబాలను సంప్రదించి నేత్రదానం ప్రాధాన్యతను వివరించినట్లు చెప్పారు. సేకరించిన కార్నియాలను సంబంధిత నేత్ర వైద్య సంస్థలకు పంపించి అవసరమైన వారికి చూపు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, పోస్టర్ ప్రచారాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నేత్రదానంపై సానుకూల నిర్ణయం తీసుకుని మరణానంతరం నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు.కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, సేవాసమితి సభ్యులు చాంద్ బాషా, మహేష్, నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ అరవింద్, నేత్రదాన స్వచ్ఛంద కార్యకర్తలు, సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు.
