



సలాం ప్రొద్దుటూరు – కడప:
కడప–రాయచోటి ప్రధాన మార్గంలోని చింతకొమ్మదిన్నె (సీకే దిన్నె) మండల పరిధిలోని మడ్డెమడుగు సమీప దర్గాలో 6వ ఉర్స్-ఎ-నూరియా శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
హజ్రత్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి అల్ మారూఫ్ బాబా నూర్ అలీ షా ఖలందర్ సుహర్వర్ది వారి 6వ ఉర్స్ సందర్భంగా ఖాన్ఖా-ఏ-నూరియా ఖాద్రియా సుహర్వర్దియా పీఠాధిపతి సయ్యద్ అబు గుఫ్రాన్ ముఫ్తీ సయ్యద్ గౌస్ అహ్మద్ హుస్సేనీ ఖాద్రి సాహెబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా 38వ జల్సా-ఏ-మీలాద్-ఏ-ముస్తఫా ﷺ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు, మతపెద్దలు, రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పవిత్ర తబర్రుకాత్ దర్శనం
పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉదయం 11.30 గంటల నుంచి మగ్రిబ్ నమాజ్ వరకు భక్తులకు పవిత్ర జియారత్-ఏ-తబర్రుకాత్ దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ ﷺకు సంబంధించిన మోయే ముబారక్, రిష్ ముబారక్, జుల్ఫ్ ముబారక్, హజ్రత్ అలీ, హజ్రత్ హసన్, హజ్రత్ హుస్సేన్‌ల మోయే ముబారక్, గౌస్ పాక్ మౌలే, దస్తార్ ముబారక్, గిలాఫ్, ఖానా-ఏ-కాబా గిలాఫ్, రౌజా-ఏ-నబీ ﷺ గిలాఫ్, ఖులఫా-ఏ-రాషిదీన్‌కు సంబంధించిన పవిత్ర తబర్రుకాత్‌ను భక్తులు దర్శించుకున్నారు.
రక్తదాన శిబిరం
ఉర్స్ సందర్భంగా ఖూన్ కా రిష్తా (కె.కె.ఆర్.) ఆధ్వర్యంలో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 21 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి కార్యక్రమానికి సహకరించారు.
ఉచిత కంటి వైద్య శిబిరం
అలాగే షబానా-ఐ-కేర్, తాడిపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి శుక్లం ఆపరేషన్లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
భక్తులకు అన్నదానం
ఉర్స్‌కు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉర్స్‌లో పాల్గొన్న భక్తులకు ప్రేమాభిమానాలతో భోజనం వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు.ఉర్స్ సందర్భంగా మడ్డెమడుగు దర్గా పరిసర ప్రాంతం భక్తులతో సందడిగా మారింది. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా కొనసాగింది.




