సలాం ప్రొద్దుటూరు – అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇప్పటికే 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తికాగా, మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు నవంబర్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించింది.ఎన్నికల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల వారీగా ఎన్నికల ప్రక్రియ, వార్డుల పునర్విభజనకు సంబంధించిన చర్యలు, రిజర్వేషన్ల ప్రక్రియ, ఇతర ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించింది.మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వార్డుల వారీ ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్ తేదీలు తదితర అంశాలను తదుపరి దశలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం ఉంది.
