ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఎడిటోరియల్కడప కలెక్టరేట్ ముట్టడించిన స్కీం వర్కర్లు

కడప కలెక్టరేట్ ముట్టడించిన స్కీం వర్కర్లు

📰 Generate e-Paper Clip

 

–₹26 వేల కనీస వేతనం, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళన

 

సలాం ప్రొద్దుటూరు( కడప):

రాష్ట్రవ్యాప్తంగా స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి నెలకు కనీస వేతనం ₹26,000 చెల్లించడంతో పాటు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రెండో రోజు కూడా కడప కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టరేట్‌ను ముట్టడించారు.

 

ఈ ధర్నాకు సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు బి. లక్ష్మీదేవి, ఆర్. లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం, డీవైఎఫ్‌ఐ, మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంఘం, ఐద్వా, ఆప్కాస్, రైతు సంఘం, సీపీఎం తదితర ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

 

ఆందోళనలో భాగంగా కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఆందోళనను ఉధృతం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకోగా, అనంతరం ఐసీడీఎస్ అధికారి నాగేశ్వరికి వినతిపత్రం సమర్పించారు.

 

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు స్కీం వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. స్కీం వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, వెంటనే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

 

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తక్షణమే కనీస వేతనం అమలు చేయాలని కోరారు. డిమాండ్లను నెరవేర్చకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని స్కీం వర్కర్ల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!