–20 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం ఎగరగొట్టారు?
– ఏం సాధించారనీ ఇంటింటికి ప్రచారం?
–ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, 50 ఏళ్లకే పెన్షన్ హామీలపై నిలదీయండి !
సలాం ప్రొద్దుటూరు:
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ప్రజలకు వందనం కాకుండా వంచనగా మారిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి, మొదటి ఏడాది అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 80 లక్షల మంది విద్యార్థులు ఉండగా, కేవలం 60 లక్షల మందికి మాత్రమే పథకం వర్తింపజేసి, మిగిలిన 20 లక్షల మందిని వివిధ కారణాలతో తొలగించారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం రూ.15 వేలలో రూ.2 వేలు పాఠశాలలకు మళ్లించి తల్లుల ఖాతాల్లో రూ.13 వేలే జమ చేస్తోందని విమర్శించిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత తామూ అదే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా అందరికీ ఒకే మొత్తాన్ని ఇవ్వకుండా రూ.5 వేలు, రూ.6 వేలు, రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.10 వేలు, రూ.11 వేలు, రూ.12 వేలు, రూ.13 వేలు చొప్పున వేర్వేరు మొత్తాలు జమ చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. సమస్యలు ఎదురైన తల్లులను సచివాలయాల్లో గ్రీవెన్స్ నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతోందని, గతంలో కూడా అలాంటి ఫిర్యాదులు చేసినా మిగిలిన డబ్బులు రాలేదని పేర్కొన్నారు.
రెండేళ్ల పాలనలో ప్రజలకు చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించిన రాచమల్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముందుగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆ తర్వాతే ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండేళ్లు పూర్తయినా ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రైతులకు మూడేళ్లలో అందాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అందించలేదని ఆరోపించారు. ప్రజలు అమాయకులు కాదని, అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు.
విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఏమైందని, రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలకు గ్యాస్ అందించారో ప్రభుత్వం వెల్లడించాలని సవాల్ విసిరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా పరిమిత బస్సులకే వర్తింపజేయడంతో ఆశించిన ప్రయోజనం అందడం లేదని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరోగ్యశ్రీ సేవల అమలు కూడా అటకెక్కిందని ఆరోపించారు.
తాను లేవనెత్తుతున్నవి వ్యక్తిగత ప్రశ్నలు కాదని, ప్రజల తరఫున అడుగుతున్న ప్రశ్నలేనని రాచమల్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూటమి నాయకులు ప్రజల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని, తమ హక్కులను కాపాడుకోవాలంటే ప్రశ్నించే సంస్కృతి అవసరమని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, హామీలు అమలవుతాయని ఆయన పేర్కొన్నారు.
