ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం–సి ఎం చంద్రబాబు

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం–సి ఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తాం. పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తాం. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలి. సమస్య పరిష్కారం కోసం అధికారులు, ఉద్యోగుల వద్దకు వచ్చే పౌరులతో సౌమ్యంగా వ్యవహరించాలి. దీని ద్వారా పాలనపై ప్రజల్లో మంచి భావన కలుగుతుంది. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులు పాలనా పరంగా సామర్ధ్యాలను పెంచుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానం మార్చుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యమివ్వాలి. ఏపీకి బలమైన మానవ వనరుల వ్యవస్థ అవసరం. పాలనలో సంస్కరణలపై ఉద్యోగులకు, అధికారులకు శిక్షణ ఇప్పించాం. పాత రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి పెద్ద టాస్క్ గా ఉండేది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సులభంగా వాటిని క్లియర్ చేయగలిగే పరిస్థితి ఉంది. వినూత్నంగా ఆలోచన చేయకపోతే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి.”అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

 

*పాత కేసుల ట్రేసింగ్*

 

“రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను బద్నాం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారాలను, విద్వేషాలు పెంచే ఘటనల్ని కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంత మంది నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పు దారి పడుతున్నారు. పాత కేసులను పరిష్కరిస్తున్నాం. 2019లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. శిక్షలు కూడా పడుతున్నాయి. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేడు. వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను పక్కాగా పాటించాలి. ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలి. డిసెంబర్ నెలలో క్వాంటం కంప్యూటర్ లాంఛ్ చేయాల్సి ఉంది. ఈలోగా క్వాంటం పార్కు, సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ, నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!