సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్):
తెలంగాణలో సంచలనం సృష్టించిన గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. భూ అక్రమాల కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మనాయుడి కోసం పోలీసులు పలు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, గండిపేట సర్వే నంబర్-18లోని 9.10 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ జీవోల ఆధారంగా రెగ్యులరైజ్ చేసుకునేందుకు బొల్లా బ్రహ్మనాయుడు మరియు ఆయన అనుచరులు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల మార్కెట్ విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.కోకాపేట నియోపోలిస్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ భూమి అత్యంత విలువైనదిగా గుర్తించబడింది. 1954-55 భూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ పోరంబోకు భూమిగా నమోదై ఉంది. అయితే కొంత భూమిని ప్రభుత్వం వ్యక్తులకు కేటాయించినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో నకిలీ పత్రాలు చక్కర్లు కొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ వ్యవహారంపై గండిపేట మండల తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర బయటపడినట్లు శేరిలింగంపల్లి డీసీపీ వెల్లడించారు.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భూమి కబ్జా ప్రయత్నం విజయవంతమైతే పక్కనే ఉన్న మరిన్ని ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు కూడా కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భూ కబ్జా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రహ్మనాయుడు పరారీలో ఉండగా, ఆయన కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.ఇటీవల నరసరావుపేటలోని బ్రహ్మనాయుడు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించినప్పటికీ ఆయన అక్కడ లభించలేదు. చివరకు కాంచీపురంలో ఆయన ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు. కేసులో ఇతర నిందితులు బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్‌తో పాటు మరికొందరు ఇంకా పరారీలో ఉన్నట్లు సమాచారం.ఈ కేసు తెలంగాణలో భూ అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో భూ కబ్జా వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
