సలాం ప్రొద్దుటూరు:
ప్రాంతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని జమ్మలమడుగు జనసేన నాయకుడు నల్లంశెట్టి నాగార్జున పేర్కొన్నారు. స్థానిక శ్రీనివాసనగర్ లోని జనసేన కార్యాలయం లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచి చేస్తామని ప్రజలను మరోసారి నమ్మించే ప్రయత్నం చేసుకోవాలన్నారు.విమర్శల కంటే ఆత్మపరిశీలన అవసరమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సూచించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ కోసం కాకినాడ వెళ్లాల్సిన అవసరం లేదని, కడప జిల్లాలోని జనసైనికులే సమాధానం చెబుతారని అన్నారు. జనసేన ప్రొద్దుటూరు నాయకుడు మంచి శివకుమార్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలపై చేసిన వ్యాఖ్యలు, అనుసరించిన వైఖరిని గుర్తు చేసుకోవాలని సూచించారు. సంస్కారం గురించి మాట్లాడే ముందు అప్పటి మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యలను పరిశీలించాలని అన్నారు. ప్రజా వేదికలపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. కడప పార్లమెంటు సమాచార సేకరణ కమిటీలో ప్రొద్దుటూరు నుంచి ఎంపికైన మాదాసు మురళీ, విజయ కుమార్, రామారావు, జిలానీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లాను చిన్నచూపు చూసే పరిస్థితులు మారుతున్న తరుణంలో మళ్లీ పాత రాజకీయాలను గుర్తు చేసేలా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర నాయకులకు నమస్కరిస్తారని, అదే సమయంలో ఢిల్లీని వణికించామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చారని, ఓటమి కారణాలను విశ్లేషించుకోవడం మంచిదన్నారు. పంతం నానాజీ వృద్ధాప్యంలో ఎమ్మెల్యే అయ్యారని వ్యాఖ్యానించడం కూడా తగదని చెప్పారు. రాచమల్లు రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం పొందినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత ఆక్రోశంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు పునరావృతం చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు సమాచార సేకరణ కమిటీ సభ్యులు రామారావు, మాదాసు మురళీ, బొల్లవరం ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ పాలకమండలి సభ్యులు రామోజీ ప్రసాద్, మంచాల సంజీవ్, బాబ్జీ, నాగముని, శివ తదితరులు పాల్గొన్నారు
.
