ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్బహుముఖ ప్రజ్ఞకు పట్టుగొమ్మలు ప్రభుత్వ పాఠశాలలు

బహుముఖ ప్రజ్ఞకు పట్టుగొమ్మలు ప్రభుత్వ పాఠశాలలు

📰 Generate e-Paper Clip

-కడప ఉప విద్యాశాఖాధికారి జి.రాజగోపాల్ రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా

-పదిలో ప్రతిభావంతులకు యుటిఎఫ్ “పురస్కారం”

 

బహుముఖ ప్రజ్ఞకు పట్టుగొమ్మలు ప్రభుత్వ పాఠశాలలేనని కడప ఉప విద్యాశాఖ అధికారి జి.రాజగోపాల్ రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా లు పేర్కొన్నారు.

 

ఆదివారం ఉదయం బద్వేలు పట్టణంలోని స్థానిక ఎన్జీవో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) బద్వేలు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్ అధ్యక్షతన ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జి.రాజగోపాల్ రెడ్డి, బి.లక్ష్మీరాజా లు మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి నూతన ఒరవడిని సృష్టించారని పేర్కొన్నారు. సరైన అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అద్భుతాలు సృష్టించగలరన్నారు. పదవ తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి విద్యాశాఖ రూపొందించిన ప్రణాళికలతో పాటు, ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి ప్రశంసనీయమైనదన్నారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తులో జీవిత లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారన్నారు. కార్పొరేట్ మాయాజాలంలో పడి ప్రభుత్వ పాఠశాలల పట్ల కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నచూపు చూస్తున్నారని, ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన ఫలితాలు వారికి కనువిప్పు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలు నేడు నాణ్యమైన విద్యకు, విలువల బోధనకు, క్రీడా మరియు సాంస్కృతిక ప్రతిభా వికాసానికి కేంద్రాలుగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులదేనన్నారు. పదవ తరగతిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబులు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రచార ఆర్భాటంతో విద్యార్థులను ఆకర్షిస్తూ ఫీజు పేరుతో లక్షలాది రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు సాధించిన ర్యాంకులు పాసైన వారి వివరాలను మాత్రమే ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటారే తప్ప, ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను ప్రకటించే ధైర్యం కార్పొరేట్ విద్యాసంస్థలకు లేదన్నారు. విద్యార్థుల సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడేది ప్రభుత్వ పాఠశాలలేనని వారు పేర్కొన్నారు. యుటిఎఫ్ కేవలం ఉపాధ్యాయుల సమస్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నదని తెలిపారు. అందులో భాగంగానే పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి ఏడాది మోడల్ పేపర్స్ రూపొందించి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను పొందడానికి దోహదపడుతున్నదని వారు పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన ఆణిముత్యాలను సమాజానికి పరిచయం చేయడంతో పాటు వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.బద్వేలు, గోపవరం మండల విద్యాశాఖాధికారులు ఎస్.మల్లిక, పి.రఘురామిరెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు జి.వెంకటసుబ్బారెడ్డి లు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు సాధించిన పరీక్షా ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకాన్ని పెంచేవిగా ఉన్నాయన్నారు. బోధనలో నైపుణ్యం, వృత్తిలో అనుభవం, తగిన విద్యార్హతలు కలిగిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే చక్కగా బోధించగలరనే విశ్వాసం ఈ ఫలితాల ద్వారా మరోసారి రుజువైందని వారు పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అద్భుత అవకాశాలు వారి సొంతమని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యా సామాగ్రి, నాణ్యమైన భోజనం తోపాటు, సమరూప దుస్తులు అందజేస్తున్నారని, భవిష్యత్తులో కృత్రిమ మేదో ఆధారిత విద్య అందుబాటులోకి వస్తున్నదన్నారు. ప్రజలు కార్పొరేట్ మోజులో పడి లక్షలాది రూపాయలు నష్టపోకుండా, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యా రంగం కోసం నిరంతరం పాటుపడుతున్న యుటిఎఫ్ కృషి శ్లాఘనీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు యుటిఎఫ్ పక్షాన మెమెంటో తోపాటు శాలువా, ఫైల్, సర్టిఫికెట్ లను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి చైర్మన్ టి.నరసింహారెడ్డి, యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.ఓబుల్ రెడ్డి బద్వేలు, గోపవరం మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి.పెంచలయ్య, టి.శ్రీనివాసులు, పి.మురళి దేవి, జి.విజయ కుమారి, ఓ.సుభాష్ చంద్రా రెడ్డి, కె.సత్యానంద రెడ్డి, గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ కె.రమాదేవి, యుటిఎఫ్ అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్ వీర దాసరి క్రిస్టఫర్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్, బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.దేవానందం, సి.కంచిరెడ్డి, ట్రెజరర్ ఎ.లాజరస్, గోపవరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.మస్తాన్ వలి, ఎం.రామచంద్రయ్య, ట్రెజరర్ బి.ఓబన్న జిల్లా కౌన్సిల్ సభ్యులు వై.రామయ్య, సి.హెచ్.సాగర్, పాలా శ్రీనివాసులరెడ్డి, పి.చక్రపాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!