–ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతల పిలుపు
సలాం ప్రొద్దుటూరు( కడప ):
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ,భారతీయ జనతా పార్టీ కి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంయుక్తంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్న ప్రజల ఓట్ల తొలగింపు పథక మైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల సమగ్ర ప్రత్యేక పునః సమీక్ష) నుంచి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని 31 డివిజన్ లో స్థానిక గుర్రాల గడ్డ ప్రాంతంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మయాన రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ – 2026 పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన ఓట్లను తొలగించే భారీ కుట్రతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ఐ ఆర్ – 2026 అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఓట్ల తొలగింపు పథకంలో భాగంగా 2002వ సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకున్నార న్నారు.
ఈ ఓటరు జాబితాలో ఓటర్లు తాము ఓటరుగా ధ్రువీకరించుకోవాలన్న నిబంధన పెట్టారన్నారు. ఈ ఏడాది జూన్ నెల 15వ తేదీ నుండి జూలై నెల 15 తేదీ వరకు కొనసాగునున్న ఎస్ఐఆర్ లో ముందుగా ప్రజలు మ్యాపింగ్ చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగకరంగా చేస్తున్నామన్నారు. ఓటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ నిర్దేశించిన ధృవీకరణ పత్రం తోపాటు గా పాత, కొత్త ఓటర్ కార్డులు చూపించాలని కోరారు. 2002వ సంవత్సరము ఓటరు జాబితాలో లేని వారు ప్రత్యేకంగా తమ దరఖాస్తును నింపి తాము ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎన్నోసార్లు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యు లను ఎన్నుకున్న ఓటర్లు తిరిగి తాము ఓటర్లుగా నిరూపించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరడం అత్యంత దారుణమన్నారు. కేవలం ముస్లిం మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకొని వారి ఓట్లను అదృశ్యం చేసే దురుద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని హెచ్చరించారు. కాబట్టి ఓటర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనార్టీ విభాగపు అధ్యక్షుడు మయానరహమతుల్లా ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బిజెపి దురుద్దేశంతోనే ఎస్ఐఆర్ తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రజలు జాగ్రత్త వహించి బిఎల్ఓ లకు తగు సమాచారం అందజేసి సహకరించాలని కోరారు. అంతేకాకుండా ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ ప్రక్రియ అత్యంత కఠినంగా మార్చారని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు తిరిగి తమ ఓటర్లుగా నిరూపించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీ కీలక భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కోరడం దుర్మార్గమన్నారు. ప్రజలు అప్రమత్తత వహించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటి వద్దకు వచ్చినప్పుడు తమ ఓటుకు మ్యాపింగ్ ఏ విధంగా నిర్వహించుకోవాలి, అనంతరం ఎలా తమ ఓటును దశలవారీగా కాపాడుకోవాలి అనే దానిపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ ఓటు వివరాలను ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో పరిశీలించుకున్నారు. ఈ ఓటర్ల అవగాహన శిబిరం ద్వారా ప్రజలు తమ ఓటుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు , వృద్ధులు యువకులు, తమ ఓట్లను పరిశీలించి ఇచ్చిన సూచనలు ప్రకారం బిఎల్ఓ లకు నివేదిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ వివిధ డివిజన్ల ప్రతినిధులు ఎస్. హమీద్, కమల్ బాషా, రఫీ ఖాన్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు సిరాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నేత ముజాహిద్ , ప్రజలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
