–12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి: సీఐటీయూ
–కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు డీఏ, మధ్యంతర భృతి వర్తింపజేయాలని డిమాండ్
సలాం ప్రొద్దుటూరు–జమ్మలమడుగు
మున్సిపాలిటీ లలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను వెంటనే పెంచాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి వేతన సవరణ చేపట్టాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు డీఏతో పాటు మధ్యంతర భృతి వర్తింపజేయాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్, నాగన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు జి. ఏసుదాస్, కార్యదర్శి ఏ. వినయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 60 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వేతనాల పెంపు కోసం వారు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.అదేవిధంగా 12వ పీఆర్సీ వేతన సవరణ కోసం కూడా ఉద్యోగులు, కార్మికులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు డీఏ, మధ్యంతర భృతి అమలు చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైన మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. 2013లో జారీ చేసిన జీవో ఆర్టికల్ నంబర్ 1615ను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో గత కొన్నేళ్లుగా కార్మిక కుటుంబాలపై ఆర్థిక భారం అధికమైందన్నారు. పిల్లల విద్య, వైద్యం, ఇంటి అద్దెలు తదితర ఖర్చులు పెరిగినా అందుకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగలేదని పేర్కొన్నారు.గత 11వ పీఆర్సీని రెండేళ్ల ఆలస్యంగా అమలు చేశారని, ప్రస్తుతం 12వ పీఆర్సీ ఏర్పాటులో కూడా జాప్యం చేయడం సరికాదని సీఐటీయూ నాయకులు అన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెరగకపోవడంతో వారి జీవన పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని తెలిపారు.ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలపై స్పందించి వేతన సవరణ, డీఏ, మధ్యంతర భృతి, పెండింగ్ జీతాల చెల్లింపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పుల్లయ్య, వినోద్, గంగన్న, పుల్లమ్మ, నటరాజు, చంటి, సుధీర్తో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
