–11 డిమాండ్లతో ప్రొద్దుటూరులో CITU ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సలాం ప్రొద్దుటూరు:
మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, అవసరమైన పనిముట్లు అందించాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్ పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతతో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆప్కాస్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, మున్సిపాలిటీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరారు.విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.కోవిడ్ సమయంలో సేవలందించిన కార్మికులకు ప్రస్తుత రేట్ల ప్రకారం కనీస వేతనం రూ.18,500 చెల్లించడంతో పాటు వారిని ఆప్కాస్‌లో చేర్చాలని కోరారు. 12వ పీఆర్సీని అమలు చేసి వేతనాలను పెంచాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కార్మికులకు అవసరమైన పనిముట్లు, కొబ్బరి నూనె, చెప్పులు, యూనిఫామ్‌తో పాటు పుష్‌కార్టులు, వీల్‌బారోలు, చెత్త డబ్బాలు, పొరకలు, పుల్లలు తదితర పారిశుద్ధ్య పరికరాలను సమకూర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్, కమిటీ సభ్యులు గురమ్మ, రమాదేవి, నీతమ్మ, ప్రమీలమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ యూనియన్ నాయకులు మేరీబాబు, దావీదు, కార్తీక్, చిన్న, ప్రసన్న తదితరులు ర్యాలీలో పాల్గొని కార్మికుల డిమాండ్లకు మద్దతు తెలిపారు.

