
–ఒకటి, రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం..
–హామీపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు రామసుబ్బయ్య యాదవ్
సలాం ప్రొద్దుటూరు:
స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సానుకూలంగా స్పందించారని ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ తెలిపారు.స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలపై కమిషనర్‌కు రామసుబ్బయ్య యాదవ్ వినతిపత్రం సమర్పించారు. ఇందులో ప్రధానంగా సుమారు ఏడాది కాలంగా సచివాలయానికి స్టేషనరీ సరఫరా కాకపోవడం, ఉద్యోగుల క్యాజువల్ లీవ్‌ల మంజూరుకు ప్రత్యేక సెక్షన్ అధికారిని నియమించడం, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 7ను త్వరితగతిన అమలు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.వినతిపత్రంపై స్పందించిన కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని, తాను కూడా అదే వ్యవస్థ నుంచి వచ్చినవాడినని తెలిపారు. స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, ప్రస్తుతం తన దృష్టికి వచ్చిన సమస్యలను ఒకటి, రెండు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
‘ఎన్టీఆర్ భరోసా’ పేరుకు పునాది అప్పుడే..
ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు రామసుబ్బయ్య యాదవ్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ గతంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎంపీడీవోగా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న ఒక అంశాన్ని గుర్తుచేశారు.2014 సెప్టెంబర్ 30న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీనివాస విశ్వనాథ్ పాల్గొన్నారని, ఆ సమయంలో వివిధ సామాజిక భద్రతా పింఛన్లకు ‘ఎన్టీఆర్ భరోసా’ అనే పేరు పెట్టాలని సూచించినట్లు రామసుబ్బయ్య యాదవ్ తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఆ పేరును అమల్లోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో 2014 సెప్టెంబర్ 30 నుంచి 2026 సెప్టెంబర్ 30 నాటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్‌ను ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఉద్యోగ ధర్మం, ప్రజా సేవలో ఆయన అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు నాగార్జున, వరప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభంజన్ రెడ్డి, ఓంకార్, నరసింహ, పీరయ్య, కిరణ్, వెంకటనారాయణ, పరబ్రహ్మం, ప్రశాంత్ నాయుడుతో పాటు స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

