–రాష్ట్రవ్యాప్తంగా పోటీకి సిద్ధం..
–యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి: ఆప్ రాష్ట్ర కన్వీనర్ శిర రమేష్ కుమార్
సలాం ప్రొద్దుటూరు – కడప:
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ శిర రమేష్ కుమార్ వెల్లడించారు.కడపలో ఆదివారం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల ఆసక్తి, స్వచ్ఛంద సేవా గుణం కలిగిన వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువకులు, యువతులు, మహిళలు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని, స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో ఆప్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర సహాయ కన్వీనర్ వెంకట చలపతి, డాక్టర్ సేవా కుమార్, కడప జిల్లా కన్వీనర్ సాజిద్ హుసేన్, జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కార్యదర్శి దస్తగిరి, అధికార ప్రతినిధి డాక్టర్ బేరిలా శ్రీనివాసులు, సహాయ కన్వీనర్ దాదా పీర్ తదితరులతో పాటు వివిధ జిల్లాల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
