–ఫిర్యాదు రిజిస్టర్లపై వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్ష
–IVRSలో సానుకూల అభిప్రాయం పెరిగేలా సేవలు అందించాలి
సలాం ప్రొద్దుటూరు:
ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంపొందించేలా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలోని వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్న ఫిర్యాదు రిజిస్టర్లపై వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేసి, సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కమిషనర్ స్పష్టం చేశారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు, ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
IVRSలో ప్రజా సానుకూల అభిప్రాయం పెరగాలి
మున్సిపల్ సేవలపై ప్రజల అభిప్రాయాలు IVRS ద్వారా నమోదు అవుతున్నందున, ప్రతి సచివాలయ సిబ్బంది ప్రజల సమస్యలను బాధ్యతగా స్వీకరించి సత్వర పరిష్కారం అందించాలని కమిషనర్ తెలిపారు. తద్వారా IVRSలో Public Positive Perception పెరిగేలా పనిచేయాలని సూచించారు.సచివాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా, ఓపికగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, పరిష్కారం దిశగా చొరవ చూపాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారం – సత్వర స్పందన – మర్యాదపూర్వక సేవలు – IVRSలో సానుకూల అభిప్రాయం అనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు.

